Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ వరమిచ్చింది.. కరెంటు స్తంభం శాపమైంది!

ఇందిరమ్మ వరమిచ్చింది.. కరెంటు స్తంభం శాపమైంది!

వార్త 1 week ago

Ramayampet News: రామాయంపేట: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అనే సామెతను నిజం చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం వరమిస్తే, మెట్ల మధ్యలో నిలిచిన కరెంటు స్తంభం తొలగించకుండా అధికారులు శాపంగా మారారు.

ఫలితంగా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో ఓ నిరుపేద కుటుంబం కన్నీటి వ్యథ అనుభవిస్తోంది.

సొంతింటి కలతో పడరాని పాట్లు పడుతోంది ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన కట్ట మారుతమ్మ కుటుంబం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమకూ ఇల్లు మంజూరైందని సంబరపడ్డారు. వెంటనే లక్షల రూపాయలు అప్పు చేసి ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఇంటి మెట్ల మధ్యలోనే విద్యుత్ స్తంభం మృత్యు కుహరంలా నిలిచింది.

డీడీ కట్టినా కదలని ఫైలు

ఇల్లు మంజూరైన వెంటనే స్తంభం తొలగించాలని అధికారులను అడిగాం. షిఫ్టింగ్‌కు రూ.7 వేలు డీడీ కట్టాలన్నారు. వెంటనే కట్టేశాం” అని బాధితురాలు మారుతమ్మ కన్నీటితో చెప్పారు. డీడీ కట్టి నెలలు గడుస్తున్నా స్తంభం మాత్రం అంగుళం కూడా కదలలేదు. ఇప్పుడు ఇంటి నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. కానీ మెట్ల మధ్యలో స్తంభం ఉండటంతో ప్లాస్టింగ్, స్లాబ్ పైన పనులు చేయలేకపోతున్నామని వాపోయారు.

లంచం ఇస్తేనే పని జరుగుతుందా?

ఇప్పుడు అధికారులను అడిగితే మళ్లీ రూ.30 వేలు ఇస్తేనే స్తంభం తీస్తామని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు” అని మారుతమ్మ భర్త రామచంద్రం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభలో సమస్యను విన్నవించినా పాలకులు, అధికారులు కనికరించడం లేదని ఆక్రోశించారు. “అప్పు చేసి ఇల్లు కడుతున్నాం. పైగా లంచం ఎక్కడి నుంచి తేవాలి? ప్రభుత్వం సహృదయంతో ఇల్లు ఇస్తే, అధికారులు మాత్రం లంచాలకు వేధిస్తున్నారు” అని బోరున విలపించారు.

Ramayampet News: బిల్లులు ఆగితే బతుకు బజారున

సకాలంలో స్తంభం తొలగించకపోతే ఇందిరమ్మ ఇంటి తదుపరి బిల్లులు ఆగిపోతాయని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. బిల్లులు రాకపోతే అప్పుల వాళ్లు వదిలిపెట్టరని, తమ బతుకులు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. “ఇలాగే వేధిస్తే మాకు ఆత్మహత్యే శరణ్యం. మా చావుకు అధికారులే కారణం” అని దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రభుత్వం పేదల పక్షాన నిలిచి ఇల్లు మంజూరు చేస్తే, క్షేత్రస్థాయి అధికారుల లంచావతారం ఆశయాన్ని నీరుగారుస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కరెంటు స్తంభాన్ని తక్షణమే తొలగించి నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎస్సీ వర్గీకరణ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha