Narendra Modi: ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ ప్రసిద్ధ 'ప్రంబానన్' హిందూ దేవాలయాల సముదాయాన్ని సందర్శించారు. ఈ పర్యటనతో విదేశాల్లో ఉన్న భారతీయ నాగరికత, సనాతన సంస్కృతికి అద్దం పట్టే ప్రాచీన కట్టడాల పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.
గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా ఉన్న చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం నిరంతరం ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ఈ చర్యలు కేవలం కట్టడాల పునరుద్ధరణకే పరిమితం కాకుండా, పొరుగు దేశాలతో చారిత్రక మరియు దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో ఆధ్యాత్మిక కేంద్రాల పునర్నిర్మాణం
1971 యుద్ధ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న బంగ్లాదేశ్‌లోని చారిత్రక రమ్నా కాళీ ఆలయ పునర్నిర్మాణానికి భారత్ పూర్తి సహకారాన్ని అందించింది. దీనితో 2021లో ఈ ఆలయం భక్తుల కోసం తిరిగి ప్రారంభమైంది. వీటితో పాటు నటోర్ ప్రాంతంలో ఉన్న సుమారు 300 ఏళ్ల నాటి జయ్ కాళీ మాత ఆలయం, ఆనందమయీ కాళీమాత కోవెల, రామకృష్ణ ఆలయాల జీర్ణోద్ధరణ పనులకు కూడా భారత ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ల రూపంలో భారీ ఆర్థిక సాయాన్ని అందజేసింది.
Narendra Modi: వియత్నాం, మయన్మార్‌లలో వారసత్వ సంరక్షణ
యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న వియత్నాంలోని ‘మై సన్’ (My Son) శైవ క్షేత్రాల పునరుద్ధరణ పనుల్లో భారత్ భాగస్వామిగా మారింది. అలాగే మయన్మార్‌లోని ప్రసిద్ధ పురావస్తు ప్రాంతమైన బగాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా దెబ్బతిన్న 12 చారిత్రక పగోడాలను, శతాబ్దాల నాటి ఆనంద ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకువచ్చే బాధ్యతను భారత పురావస్తు శాఖ (ASI) విజయవంతంగా చేపట్టింది.
నేపాల్ పునర్నిర్మాణానికి భారీ సాయం
2015లో సంభవించిన పెను భూకంపం వల్ల నేపాల్ తీవ్రంగా నష్టపోయింది. ఆ సమయంలో నేపాల్ పునర్నిర్మాణ పనుల కోసం భారత్ 50 మిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా అక్కడ దెబ్బతిన్న 28 చారిత్రక, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ పనులను భారత్ ముందంజలో ఉండి చేపట్టింది. వీటిలో ప్రసిద్ధ సేతో మచ్ఛింద్రనాథ్ ఆలయం, బుధనీలకంఠ ఆలయ ధర్మశాల వంటి ప్రముఖ కట్టడాలు ఉన్నాయి.
అంగ్కోర్ వాట్ నుండి వాట్ ఫూ శివాలయం వరకు
కంబోడియాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అంగ్కోర్ వాట్, తా ప్రోమ్, ప్రెహ్ విహియర్ వంటి అద్భుత కట్టడాల పరిరక్షణలో భారత సాంకేతిక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితో పాటు లావోస్ దేశంలో దాదాపు వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ‘వాట్ ఫూ’ శివాలయం పునరుద్ధరణ ప్రాజెక్టులకు కూడా భారతదేశం నిరంతర మద్దతును అందిస్తోంది.
గల్ఫ్ దేశాలు, శ్రీలంకలోనూ భారత ముద్ర
2019లో ప్రధాని నరేంద్ర మోదీ బహ్రెయిన్ పర్యటించిన సమయంలో.. మనామాలో ఉన్న 200 ఏళ్ల నాటి చారిత్రక శ్రీనాథ్‌జీ ఆలయ పునర్వికాస ప్రాజెక్టుకు స్వయంగా శంకుస్థాపన చేశారు. మరోవైపు శ్రీలంకలోని అత్యంత పురాతనమైన తిరుకేతీశ్వరమ్ ఆలయ పునరుద్ధరణ పనులకు కూడా భారత ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ సాయాన్ని అందించి ఆదుకుంది.
సాంస్కృతిక బంధాల బలోపేతమే ధ్యేయం
దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలతో భారతదేశానికి వేల సంవత్సరాల నాటి నాగరికత, సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. విదేశాల్లోని ప్రాచీన హిందూ దేవాలయాలను, బౌద్ధ కట్టడాలను సంరక్షించడం ద్వారా భారత్ తన సాంస్కృతిక దౌత్యాన్ని (Cultural Diplomacy) అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరిస్తోందని, ఇది ఆయా దేశాలతో స్నేహ సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేరుస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి - ఇండోనేషియా ప్రెసిడెంట్

