Actor Naresh: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) విధానంపై టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విధానం వల్ల సామాన్య బైక్ వినియోగదారుల నుంచి లగ్జరీ కార్లు నడిపేవారి వరకు అందరూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. ఇథనాల్ పెట్రోల్ వాడటం వాహనాల ఇంజిన్లకు 'గుండెపోటు' తెప్పించడమేనని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం ఇటు సినీ, అటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

స్నేహితుడి కారు రిపేరుకు రూ.3.5 లక్షల ఖర్చు
తాను దేశ వ్యతిరేకిని కాదంటూనే నరేశ్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల జరుగుతున్న నష్టాలను ఎండగట్టారు. “బీజేపీకి తీవ్ర సానుభూతిపరుడైన నా స్నేహితుడు ఇటీవల టయోటా క్యామ్రీ కారు కొనుగోలు చేశాడు. అయితే ఈ ఇథనాల్ పెట్రోల్ వాడటం వల్ల ఆ కారు ఇంజిన్ వాల్వులు పూర్తిగా పాడైపోయాయి. వాటిని మార్చడానికి అతనికి ఏకంగా రూ.3.5 లక్షలు ఖర్చయింది” అని నరేశ్ పేర్కొన్నారు.
Actor Naresh: సామాన్యుల పరిస్థితిపై నరేశ్ ఆందోళన
లగ్జరీ కార్ల నిర్వహణ భారం గురించి ప్రస్తావిస్తూ.. “నేను కొత్తగా కొన్న పోర్షే పనమెరా కారుకు ఇలాంటి పరిస్థితే వస్తే, రిపేరుకు సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ భారీ నష్టాన్ని ముందే ఊహించి, నేను ఇప్పుడు లీటరు రూ.165 చెల్లించి మరీ హై-ఆక్టేన్ 100 పెట్రోల్‌ను పోయించాల్సి వస్తోంది. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే, మరి సామాన్య ప్రజలు, నిత్యం బైక్‌లపై తిరిగే మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటి? ఈ ఇథనాల్ పెట్రోల్ వారి పాలిట ఒక పీడకలలా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీకి ఇది ‘రెడ్ సిగ్నల్’ అంటూ హెచ్చరిక
గతంలో బీజేపీలో పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ నరేశ్ రాజకీయంగానూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బీజేపీకి ఒక బలమైన థింక్ ట్యాంక్ ఉందని, వారు ఏ పనైనా పక్కా ప్రణాళికతో చేస్తారని మాజీ లీడర్‌గా నాకు తెలుసు. కానీ పర్యావరణ పరిరక్షణ పేరుతో కోట్లాది మంది ప్రజల జేబులకు చిల్లు పెట్టే ఈ నిర్ణయం చాలా హడావుడిగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. గత ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటమే ఒక హెచ్చరిక. ఇలాంటి తరుణంలో ఈ ఇథనాల్ పాలసీ బీజేపీకి కచ్చితంగా ఒక 'రెడ్ సిగ్నల్' లాంటిదే” అని విశ్లేషించారు.
బ్రెజిల్ లాంటి దేశాలను చూసి నేర్చుకోవాలి
ప్రపంచ దేశాల ఉదాహరణలను ప్రస్తావిస్తూ.. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు ఇథనాల్ ఇంధన విధానాన్ని చాలా కాలం పాటు దశలవారీగా, పక్కాగా అమలు చేసి విజయం సాధించాయని నరేశ్ గుర్తుచేశారు. మన దేశంలో మాత్రం ప్రభుత్వం ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటోందో అర్థం కావడం లేదన్నారు. కేవలం ఒక పౌరుడిగా తన ఆందోళనను మాత్రమే వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com

