Bhogapuram airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ క్రెడిట్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
ఈ విమానాశ్రయ ప్రారంభాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనని మాటలను అన్నట్లుగా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. "ఎర్రబస్సు కూడా రాని చోట ఎయిర్‌బస్సు ఎందుకు?" అని జగన్ ప్రశ్నించినట్లు చేస్తున్న ప్రచారం కేవలం అసత్యమని స్పష్టం చేశారు. గతంలో విమానాశ్రయం నిర్మాణానికి ముందు స్థానిక బాలిక అడిగిన ప్రశ్నను జగన్ ప్రస్తావిస్తే, దానిని టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఆరోపించారు.

అసలు క్రెడిట్ ఎవరిది?: రోడ్డు కనెక్టివిటీపై వైఎస్సార్‌సీపీ ప్రశ్నలు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో 75% నుండి 80% మేర పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని సజ్జల వెల్లడించారు. భూసేకరణ, పరిహారం (R&R), అనుమతులు, జల మరియు విద్యుత్ సరఫరాల వంటి కీలకమైన ప్రక్రియలను తామే పూర్తి చేశామని, మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి రెండేళ్లు పట్టిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఈ విమానాశ్రయ ఘనత ఎవరికి దక్కాలని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ఎయిర్‌పోర్ట్ సిద్ధమైనప్పటికీ దానికి సరైన నేషనల్ హైవే రోడ్డు యాక్సెస్ ఇంకా కల్పించలేదని, దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని సజ్జల ఎత్తి చూపారు.

