Chandrababu Naidu: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజధాని అంశంపై అవలంబిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపి, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత రోజుకో మాట మాట్లాడుతున్నారని, నిన్న విజయవాడ అన్న వారు, నేడు ‘మావిగన్’ అంటూ అర్థరహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడిన ఇలాంటి సున్నితమైన అంశంపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం శోచనీయమని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి మతిస్థిమితం లేని మాటలను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు.

సరిగ్గా 24 నెలల్లో స్టీల్ ప్లాంట్ పూర్తి.. వైకాపా మోసాలకు కాలం చెల్లింది
గత ప్రభుత్వం 2019, 2023 సంవత్సరాల్లో కేవలం ఎన్నికల లబ్ధి కోసమే ఈ స్టీల్ ప్లాంట్‌కు రెండుసార్లు మోసపూరితంగా శంకుస్థాపనలు చేసిందని, కానీ క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే అన్ని అడ్డంకులను తొలగించి పనులను వేగవంతం చేశామన్నారు. “ఈరోజు (జూలై 3) తేదీని గుర్తుపెట్టుకోండి.. సరిగ్గా 24 నెలల్లో, అంటే 2026 జూలై 3వ తేదీ నాటికి ఈ కర్మాగారాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం” అని ముఖ్యమంత్రి స్పష్టమైన గడువును ప్రకటించారు. తాము మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపిస్తామన్నారు.
Chandrababu Naidu: రూ.36,700 కోట్ల భారీ పెట్టుబడి.. దేశంలోనే తొలి గ్రీన్ స్టీల్ ప్లాంట్
ఈ భారీ ఉక్కు కర్మాగారాన్ని మొత్తం రూ.36,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందులో మొదటి విడత కింద రూ.4,500 కోట్లు, రెండో విడతలో రూ.11,850 కోట్లు ఉక్కు ఉత్పత్తి ప్రాజెక్టుపై ఖర్చు చేయనుండగా, ప్లాంట్‌కు అవసరమైన పునరుత్పాదక ఇంధనం (సౌర విద్యుత్) కోసం ప్రత్యేకంగా రూ.20,350 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా రెండు దశల్లో కలిపి 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి కానుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తి పర్యావరణహితమైన పద్ధతుల్లో, గ్రీన్ ఎనర్జీతో ‘గ్రీన్ స్టీల్’ ఉత్పత్తి చేసే ప్లాంట్ రాయలసీమలో ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికే గర్వకారణమని చంద్రబాబు అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1,100 ఎకరాల భూమితో పాటు, గండికోట నుంచి 2 టీఎంసీల నీరు, రవాణా సౌకర్యాలను కల్పించింది.
రాయలసీమను ‘రత్నాల సీమ’గా మారుస్తాం.. పారిశ్రామిక హబ్‌గా లంకె
రాయలసీమను వెనుకబడిన ప్రాంతంగా ఉంచబోమని, దీనిని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ‘రత్నాల సీమ’గా మారుస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖ తరహాలోనే రాయలసీమ కూడా ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే కీలక స్థానాన్ని ఆక్రమిస్తుందన్నారు. కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, స్పేస్ టెక్నాలజీ, గోల్డ్ మైనింగ్ వంటి రంగాలను ఇక్కడికి రప్పించి ప్రాంత ముఖచిత్రాన్ని మారుస్తామన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను ఆగస్టు 15 లోగా మదనపల్లిలో రూ.1 లక్ష కోట్లతో ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే ‘వన్ ఫ్యామిలీ, వన్ ఆంత్రప్రెన్యూర్’ పథకం ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు.
శాంతిభద్రతలకు పెద్దపీట.. అరాచకాలకు తావులేదు
రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి సాధించాలంటే శాంతిభద్రతలు సజావుగా ఉండటం అత్యంత ఆవశ్యకమని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాలనలో గంజాయి సంస్కృతి, బ్లేడ్ బ్యాచ్‌ల రౌడీయిజం పెరిగిపోయాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అరాచకాలకు తావులేదని, ముఖ్యంగా మహిళల జోలికి వస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. హింసాత్మక రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలికారని, రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక హబ్‌గా మార్చే వరకు తమ ప్రభుత్వం విశ్రమించదని సీఎం తేల్చి చెప్పారు.
Epaper: epaper.vaartha.com

