CM Revanth : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు.
నోరారా 'జై తెలంగాణ' అని అనడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనసొప్పడం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ మాటే విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, హామీల అమలులో నిరుద్యోగులను, ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

తెలంగాణ హక్కుల పరిరక్షణ కేసీఆర్‌తోనే సాధ్యం
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం, హక్కుల కోసం పుట్టిన బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఏపీకి ఇలా అడిగే ధైర్యం ఉండేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలంటే, మళ్లీ తెలంగాణను కేసీఆర్ చేతిలోనే పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి పోతోందని, ప్రాంతీయ భావనలను పక్కనపెట్టి రాష్ట్ర పురోగతి కోసం బిఆర్ఎస్ మళ్లీ పోరాటాలకు సిద్ధమవుతుందని పేర్కొన్నారు.

