Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు ప్రబోవో

జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు ప్రబోవో

వార్త 2 weeks ago

Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం ఇండోనేషియా రాజధాని జకార్తాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా విచ్చేసి సాదర స్వాగతం పలికారు.

ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి అధ్యక్షుడు స్వయంగా రావడం ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ బంధానికి అద్దం పడుతోంది.

అంతకుముందు, ప్రధాని ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా నిలిచి గౌరవ వందనం సమర్పించాయి. జకార్తా ఎయిర్‌పోర్టులో ఇండోనేషియా సంప్రదాయ నృత్యాలతో భారత ప్రధానికి ఘన సంస్కృతిక స్వాగతం లభించింది.

ద్వైపాక్షిక చర్చల అజెండా

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్-ఇండోనేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడంతో పాటు వాణిజ్యం, రక్షణ రంగం, సముద్ర భద్రత, పెట్టుబడులు మరియు డిజిటల్ సాంకేతికత వంటి కీలక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరు దేశాల అధినేతలు దృష్టి సారించనున్నారు.

Narendra Modi: చారిత్రక బంధం – సాంస్కృతిక సత్సంబంధాలు

తన పర్యటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. 2018లో ఇరు దేశాల సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత తాము ఇండోనేషియాలో జరుపుతున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదేనని గుర్తుచేశారు. ఈ ఏడాది భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో పర్యటనకు కొనసాగింపుగానే ఈ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. జకార్తాలో భారతీయ ప్రవాసులతో (Diaspora) ముచ్చటించనున్న మోదీ, అనంతరం ప్రసిద్ధ ‘ప్రంబనన్’ ఆలయ సముదాయాన్ని సందర్శించనున్నారు. ఈ పురాతన ఆలయం భారత్-ఇండోనేషియా చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యమని ఆయన అభివర్ణించారు.

ఆర్థిక, రక్షణ రంగాల్లో మైత్రి:

గడిచిన కొన్నేళ్లుగా రక్షణ, ఇండో-పసిఫిక్ సముద్ర భద్రతలో ఉభయ దేశాల భాగస్వామ్యం గణనీయంగా బలపడింది. బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా, ఉమ్మడి సైనిక విన్యాసాలు ఇందుకు నిదర్శనం. ఆర్థిక రంగానికి వస్తే.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 24.78 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం దాదాపు 130కి పైగా భారతీయ సంస్థలు ఇండోనేషియాలో తమ వ్యాపారాలను విస్తరించాయి.

ఇండోనేషియా పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదుపరి విడతగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటించనున్నారు.

పథకం ప్రకారమే పహల్గామ్ దాడి..ఛార్జ్‌షీట్‌లో హఫీజ్ సయీద్ పేరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha