Noida Airport : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (జెవార్ ఎయిర్‌పోర్ట్) స్వల్ప వ్యవధిలోనే జలమయమైంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విమానాశ్రయం లోపలి భాగంతో పాటు టెర్మినల్ బిల్డింగ్, విశాలమైన పార్కింగ్ ఏరియాలోకి వర్షపు నీరు భారీగా చేరింది. ఎయిర్‌పోర్ట్ ఆవరణలో నీరు నిలిచిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో తీవ్ర కలకలం రేగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపటడం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా “ఎయిర్‌పోర్ట్ విత్ సీ పోర్ట్”, “రన్ వే పై స్విమ్మింగ్ పూల్” అంటూ ప్రభుత్వంపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.

వివరణ ఇచ్చిన విమానాశ్రయ అధికారులు
ఈ వివాదంపై నోయిడా ఎయిర్‌పోర్ట్ అధికారులు తక్షణమే స్పందించి వివరణ ఇచ్చారు. తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం వల్ల డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడి పెరిగి నీరు లోపలికి వచ్చి చేరిందని తెలిపారు. పరిస్థితిని గమనించిన వెంటనే పంపింగ్ సిస్టమ్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే నీటిని పూర్తిగా బయటకు తొలగించినట్లు స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి తీవ్రమైన అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా డ్రైనేజీ కాలువల సామర్థ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు.
ఆప్ ఎమ్మెల్యేపై సీఎం రేఖా గుప్త ఫైర్.. సరైన దుస్తులు ధరించాలని హితవు

