JIO : భారత టెలికం రంగా చరిత్రలో రిలయన్స్ జియో ఒక అపూర్వమైన సంచలనాన్ని సృష్టించింది. 2016 సెప్టెంబర్ 5న ప్రారంభమైన జియో ప్రయాణం నేటితో విజయవంతంగా 10 వసంతాలను పూర్తి చేసుకుంది.
జియో అడుగుపెట్టకముందు దేశంలో 1GB డేటా ధర సగటున రూ.228 వరకు ఉండగా, సామాన్యుడికి ఇంటర్నెట్ అనేది ఒక లగ్జరీగా ఉండేది. అయితే జియో ప్రవేశపెట్టిన విప్లవాత్మక ఆఫర్లు, ఉచిత వాయిస్ కాల్స్ మరియు అత్యంత చౌకైన డేటా ప్లాన్ల వల్ల పదేళ్ల కాలంలో 1GB డేటా సగటు ధర ఏకంగా రూ.7.9కి పడిపోయింది. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి, ప్రతి చేతికి స్మార్ట్‌ఫోన్ చేరడానికి జియో తీసుకువచ్చిన ఈ తీవ్రమైన ధరల తగ్గింపే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

యూజర్ల రికార్డు.. అగ్రగామిగా టెలికం దిగ్గజం
జియో అందిస్తున్న వేగవంతమైన 4G, 5G సేవల కారణంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఊహించని రీతిలో పెరిగింది. ఒకప్పుడు నెలకు కొన్ని ఎంబీలకే పరిమితమైన భారతీయుల సగటు డేటా వినియోగం, ప్రస్తుతం నెలకు ఏకంగా 42.3GBకి చేరుకోవడం గమనార్హం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 3.25 కోట్లకు పైగా ఉండగా, దేశవ్యాప్తంగా మొత్తంగా 50 కోట్లకు పైగా వినియోగదారులతో జియో రికార్డు సృష్టించింది. గత పదేళ్ల కాలంలో నిలకడైన సేవలు, వినూత్న సాంకేతికతతో ప్రైవేట్ టెలికం రంగంలో అగ్రస్థానంలో నిలిచిన జియో, రాబోయే రోజుల్లో 5G విస్తరణ మరియు డిజిటల్ సేవలలో మరింత పురోగతి సాధించేందుకు సిద్ధమవుతోంది.

