Fee Reimbursement : తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఈ నెల 14న (మంగళవారం) రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీతేజ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం గడుస్తున్నా, విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.వందల కోట్ల విద్యా దీవెన, స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేయకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు పైచదువులు చదవలేక, సర్టిఫికెట్లు చేతికి రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Fee Reimbursement Duesవిజయవంతం చేయాలని యాజమాన్యాలు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి
ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా చేపట్టబోయే ఈ విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ఈ బంద్‌కు సహకరించాలని పృథ్వీతేజ విజ్ఞప్తి చేశారు. నిధుల కొరత సాకుతో విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, జులై 14 నాటి బంద్ ద్వారా ప్రభుత్వానికి విద్యార్థి శక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, విద్యాశాఖ అధికారులు స్పందించి తక్షణమే బకాయిల విడుదలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

