Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జులై తొలివారంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం!

జులై తొలివారంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం!

వార్త 2 days ago

Bhogapuram Airport : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) ఈ ఏడాది జులై మొదటి వారంలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

ఈ మెగా ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. జులై 5, 8 లేదా 10వ తేదీలలో ఏదో ఒక రోజున విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి వీలుగా ప్రధానమంత్రి కార్యాలయానికి (PMO) రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పీఎంఓ నుంచి తుది అనుమతి రాగానే అధికారిక తేదీని ప్రకటించనున్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేలా నిర్మిస్తున్న ఈ గ్రీన్-ఫీల్డ్ విమానాశ్రయం మొదటి దశ పనులు దాదాపు పూర్తికావడంతో, ప్రారంభోత్సవ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది.

Read Also : ఎండల ధాటికి 10 లక్షల కోళ్లు మృతి..

 Bhogapuram Airport

సింగపూర్ విమాన సర్వీసులు ప్రారంభం

భోగాపురం విమానాశ్రయం జులై 5నే ప్రారంభం కాబోతోందనే సంకేతాలు అంతర్జాతీయ విమానయాన సంస్థల చర్యల ద్వారా స్పష్టమవుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ‘స్కూట్ ఎయిర్‌లైన్స్’ (Scoot Airlines) ఇప్పటికే తమ ప్రయాణ ఏజెంట్లకు ఒక కీలక లేఖ రాసింది. జులై 8వ తేదీ నుండి సింగపూర్ వెళ్లే తమ అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రస్తుత విశాఖపట్నం (INS డేగా) విమానాశ్రయం నుండి కాకుండా, కొత్తగా నిర్మించిన భోగాపురం విమానాశ్రయం నుంచే నడుపుతామని ఆ లేఖలో స్పష్టం చేసింది. దీనిని బట్టి జులై 5వ తేదీనే ప్రారంభోత్సవం పూర్తి కానుందని పర్యాటక, రవాణా రంగాలు అంచనా వేస్తున్నాయి. ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకే కాకుండా పొరుగున ఉన్న ఒడిశా వాసులకు కూడా అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. అంతేకాకుండా, ఉత్తరాంధ్ర రీజియన్‌లో పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల వృద్ధికి ఈ ఎయిర్‌పోర్ట్ ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha