Revanth Reddy: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ప్రతిష్టాత్మక కుమురం భీం ఆదివాసీ భవన్‌లో గురువారం మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్ అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లౌకిక వాదానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

సమానత్వాన్ని నమ్మే ఏకైక పార్టీ కాంగ్రెస్
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఒక నిజమైన సెక్యులర్ పార్టీగా కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. కుల, మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు మరియు ఇతర అన్ని వర్గాలను సమాన దృష్టితో చూసే సంస్కృతి కాంగ్రెస్‌ది అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఏకంగా 4 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేశారు.
Revanth Reddy:రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రలు విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన మైనార్టీ రిజర్వేషన్లను తొలగించడానికి కొందరు నాయకులు గతంలో కుట్రలు పన్నారని సీఎం విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంత ప్రయత్నించినా మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు దక్కుతున్న రిజర్వేషన్లను రద్దు చేసి తీరుతామని అమిత్ షా బహిరంగంగానే మాట్లాడారని ఆయన గుర్తుచేశారు.
గుజరాత్‌లో దమ్ముంటే రద్దు చేయాలి: సవాల్
తెలంగాణలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికే అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఘాటు సవాల్ విసిరారు. చేతనైతే ముందుగా బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌లో మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేసి చూపాలని ఆయన సవాల్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.
Epaper: epaper.vaartha.com

