Congress 1000 Days Palana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు.
ప్రభుత్వం సాధించిన పురోగతిపై కాంగ్రెస్ నాయకత్వం ప్రకటనలు చేస్తుండగా, కేటీఆర్ వేర్వేరు అంశాలను లేవనెత్తుతూ కాంగ్రెస్ పాలనపై చార్జిషీట్‌ను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే స్వర్గం చూపిస్తామని హామీ ఇచ్చి, గత వెయ్యి రోజులుగా తెలంగాణ ప్రజలకు నరకం చూపిస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో పాలన పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ దాదాపు రూ. 4.50 లక్షల కోట్ల మేర అప్పులు చేసి రాష్ట్రాన్ని రుణభారంలోకి నెట్టిందని మండిపడ్డారు.

అభివృద్ధి ఆగిపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, పూర్తి చేసిన పనులకు కేవలం రిబ్బన్ కటింగ్లు చేయడం తప్ప కాంగ్రెస్ సొంతంగా చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో పంచభక్ష పరమాన్నంలా సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం కుక్కలు చించిన విస్తరిలా మార్చివేసిందని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఈ చార్జిషీట్ ప్రకటనతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ సమరం మరింత వేడెక్కింది.

