Vidadala Rajani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకే పరిమితమైందని ఆమె విమర్శించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ మేరకు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బీసీ వర్గానికి చెందిన నాయకులను టార్గెట్ చేస్తూ వరుస అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

కుటుంబ సభ్యులు, అధికారులపై వేధింపులు
గత ప్రభుత్వంలో మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయనే తప్పుడు నిందలతో కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారని రజని పేర్కొన్నారు. కేవలం ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని, కొద్ది రోజుల క్రితం కుమారుడు సునీల్‌ను కూడా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఇద్దరు రిటైర్డ్ ఉన్నతాధికారులను కూడా అన్యాయంగా జైలుపాలు చేశారని ఆమె దుయ్యబట్టారు.
Vidadala Rajani: గత టీడీపీ హయాంలోనే భారీగా మద్యం అక్రమాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని రజని స్పష్టం చేశారు. దుకాణాల సంఖ్యను తగ్గించడంతో పాటు బెల్టు షాపులను, పర్మిట్ రూమ్‌లను పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. కానీ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మద్యం విక్రయాల్లో వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. బార్ల యజమానులకు లబ్ధి చేకూర్చేలా ప్రివిలేజ్ ఫీజులు మాఫీ చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని విమర్శించారు. ఆనాడు అమ్మకాలు పెరిగినా ప్రభుత్వ ఆదాయం ఎందుకు రాలేదని ప్రశ్నిస్తూ, ఆ అవకతవకలపై అప్పట్లోనే కేసు కూడా నమోదైందని గుర్తుచేశారు.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే యత్నం
చంద్రబాబుపై ఉన్న పాత కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని రజని ఆరోపించారు. కక్ష సాధింపు రాజకీయాలు ఎన్నాళ్లో సాగవని, ప్రభుత్వం ఇప్పటికైనా తన ధోరణిని మార్చుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజలే తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
విశాఖలో బ్రిక్స్ క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు

