MLA Surendra Babu: 53 మంది బాధితులకు రూ.33.16 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో అర్హులైన ప్రతి బాధితుడికి ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక ప్రజావేదికలో శుక్రవారం టీడీపీ సీనియర్ నాయకులు, మండల పార్టీ కన్వీనర్లు, మార్కెట్ యార్డు చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో 53 మంది బాధితులకు మొత్తం రూ.33,16,801 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వింత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు యస్విత శ్రీ, జైశ్విక శ్రీ వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే తనవంతుగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా విజయవాడ ఎయిమ్స్ అధికారులతో మాట్లాడి మెరుగైన చికిత్సలు అందించేలా సహాయపడాలని ఆదేశించారు.

Read Also:Bonda Uma: పేర్ని నానికి బొండా ఉమ తీవ్ర హెచ్చరిక.. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్
డీఎస్సీపై అసత్య ఆరోపణలు తగవు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని అన్నారు. ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు లేకుండా ఒకేసారి 16,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అవమానించేలా ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.తమ ప్రభుత్వ హయాంలోనే ఇప్పటివరకు పలు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో డీఎస్సీ నియామకాలపై ప్రశ్నలు ఉన్నాయని ఎమ్మెల్యే విమర్శించారు.

గత పాలనపై విమర్శలు
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో మద్యం విధానం ద్వారా వచ్చిన నిధుల వినియోగంపై కూడా ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద విధులు నిర్వహించే పరిస్థితికి తీసుకెళ్లారని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన నిధులు తాడేపల్లి కేంద్రంగా వినియోగించబడ్డాయని విమర్శించారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో తాగునీరు, సాగునీటి సమస్యలకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. 2019-2024 మధ్య నియోజకవర్గ అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపలేదన్నారు. ఐదేళ్లపాటు కళ్యాణదుర్గం వైపు చూడని నాయకులు ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
MLA Surendra Babu: ప్రెస్‌క్లబ్‌కు స్థలం కేటాయించి భవనం నిర్మిస్తాం
ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు, నాయకులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. మీడియా ప్రతినిధుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కళ్యాణదుర్గంలో ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించి, ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణాన్ని కూడా చేసి పత్రికా స్వేచ్ఛకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పేదలు, బలహీనవర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన ప్రతి బాధితుడికి సహాయం అందేలా తన వంతు కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్క్ కమిటీ, సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొనగా కంబదూరు మండల కన్వీనర్ శివన్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Epaper: epaper.vaartha.com
ఈ నెలలోనే అమరావతిలో 2 కీలక ప్రాజెక్టులు ప్రారంభం.. సీఎం చంద్రబాబు

