Telangana Govt: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న ప్రతిష్టాత్మక పథకాల అమల్లో మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే 'కల్యాణలక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాల నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ, లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సరికొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ మార్పుల ద్వారా దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయం అందనుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు రూ. 1,00,116 ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అయితే, ఈ పద్ధతి వల్ల నిధులు చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని భావించిన ప్రభుత్వం, ఇకపై చెక్కుల పంపిణీ విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది. దీనికి బదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నట్లుగా.. ప్రత్యక్ష నగదు బదిలీ (DBT – Direct Benefit Transfer) విధానాన్ని ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తోంది. దీని ద్వారా సాయం మొత్తం నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే జమ అవుతుంది.
Telangana government to make key changes to the Kalyana Lakshmi and Shaadi Mubarak schemes!
Telangana Govt: దరఖాస్తులు, ఆమోదం కోసం సరికొత్త ఆన్‌లైన్ పోర్టల్
ఈ పథకాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక అధునాతన ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకురానుంది. కేవలం దరఖాస్తు చేసుకోవడమే కాకుండా, అధికారుల పరిశీలన, ఆమోద ప్రక్రియ (Approval Process) కూడా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగనుంది. దీనివల్ల ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్న నిజమైన లబ్ధిదారులను కంప్యూటర్ వ్యవస్థే త్వరగా గుర్తిస్తుంది. ఫలితంగా దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే నిధులు లబ్ధిదారుల అకౌంట్లలో పడటానికి మార్గం సుగమం అవుతుంది.
పెండింగ్ దరఖాస్తులకు చెక్.. అధికారులపై తగ్గనున్న పని ఒత్తిడి
ప్రస్తుత రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వేలాది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు ఎమ్మార్వో (MRO), ఆర్డీవో (RDO)ల పరిధిలో పెండింగ్‌లో ఉండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే లబ్ధిదారులు ఏడాది కాలంగా సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ అధికారులకు రోజువారీ భూ పరిపాలన బాధ్యతలతో పాటు ఓటర్ల జాబితా సవరణ (SSR), జనగణన వంటి ఇతర ప్రభుత్వ విధులను నిర్వహించాల్సి రావడంతో వారిపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల సంక్షేమ పథకాల క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌కు సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా కొత్త ఆన్‌లైన్ వెరిఫికేషన్ మరియు డీబీటీ విధానాన్ని తీసుకువస్తూ ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉంది.
ఒక్క క్లిక్‌తో మున్సిపల్ పన్నుల చెల్లింపు - తెలంగాణ ప్రభుత్వం 'బిల్ వన్' సేవ

