CPI Narayana: జెన్ జీ యువతతో పాటు మహిళలను ఉద్దేశించి ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అవమానకరంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.
నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో సమాజంలోని వివిధ వర్గాల భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీసిన కంగన.. బాధితులైన యువతకు, మహిళలకు తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి: నారాయణ హితవు
ప్రజా జీవితంలోనూ, ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు ఎవరైనా సరే తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరిచేటప్పుడు తగిన సంయమనం, బాధ్యత పాటించాలని నారాయణ హితవు పలికారు. సమాజంలో అనవసర విభేదాలు సృష్టించి, పవిత్రమైన ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా కంగనా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన మండిపడ్డారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైఖరిని అభినందించిన సీపీఐ నేత
ఇదే సందర్భంగా గతంలో నిరసనకారులను ఉద్దేశించి వచ్చిన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సానుకూలంగా స్పందించడాన్ని నారాయణ ప్రశంసించారు. ఆ వ్యాఖ్యల వల్ల కలిగిన భావోద్వేగ బాధను గుర్తించి దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. తాను చేసిన తప్పును గుర్తించి సరిదిద్దుకునే ఇటువంటి ఉన్నతమైన వైఖరి మన దేశ న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని, అత్యున్నత సాంప్రదాయాలను అద్దం పడుతుందని ఆయన కొనియాడారు.

