Heavy Rains in AP : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలను వేగవంతం చేయడం మరియు ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలు విధుల్లో నిమగ్నమయ్యాయి.
ఎస్‌డీఎంఏ అత్యవసర కంట్రోల్ రూమ్ నంబర్లు: బాధితులకు తక్షణ సాయం
వర్షాలు మరియు వరదల వేళ ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు సంప్రదించడానికి స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070 మరియు 1800 4250101 లను అందుబాటులో ఉంచింది. వీటితో పాటు ప్రతి జిల్లా కలెక్టరేట్ వేదికగా ప్రత్యేక జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏవైనా అత్యవసర సహాయాలు లేదా సమాచారం కోసం స్థానిక కంట్రోల్ రూమ్ నంబర్లకు గానీ, స్టేట్ టోల్ ఫ్రీ నంబర్లకు గానీ ఫోన్ చేసి సహాయం పొందాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

