Karnataka Minister : కర్ణాటకకు చెందిన సీనియర్ మంత్రి ఎస్.ఎస్. మల్లికార్జున్ బీజేపీ ఎమ్మెల్యేపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
భద్రా రిజర్వాయర్ నుండి వ్యవసాయానికి సాగునీరు విడుదల చేయాలంటూ స్థానిక రైతులు మంత్రిని కలిసిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమస్యపై తాము ముందుగా హరిహర బీజేపీ ఎమ్మెల్యే బి.పి. హరీష్‌ను కలిసి నీటి విడుదల గురించి అడగ్గా, సదరు ఎమ్మెల్యే “ఈ విషయం నా పరిధిలో లేదు, నేరుగా మంత్రి దగ్గరకే వెళ్లండి” అని తమకు చెప్పారని రైతులు మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే జవాబు విన్న మంత్రి మల్లికార్జున్ తీవ్ర ఆగ్రహానికి లోనై, సహనం కోల్పోయి సదరు బీజేపీ ఎమ్మెల్యేను “అన్నా అని పిలవొద్దు, చెప్పులతో కొట్టాలి” అంటూ అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కేబినెట్ మంత్రి అవమానించారు - తిప్పికొట్టిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్
మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో వైరల్ కావడంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి వ్యాఖ్యలపై హరిహర బీజేపీ ఎమ్మెల్యే బి.పి. హరీష్ ఘాటుగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేబినెట్ మంత్రి ప్రజాప్రతినిధిపై ఇలాంటి బూతులు, నీచమైన వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతుల సమస్యలను పరిష్కరించడం చేతకాక, తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఇటువంటి నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీష్ స్పష్టం చేశారు. ఈ ఘటనతో కర్ణాటకలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
యువకుడి కడుపులో గర్భాశయం.. వైద్యులను ఆశ్చర్యపరిచిన అరుదైన కేసు

