Vemula Prashanth Reddy: కష్టకాలంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఎవరున్నారో కవిత ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు.
తనపై కవిత చేసిన నిరాధార ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన కుమార్తె చర్యల కారణంగా పార్టీ అధినేత, తండ్రి అయిన కేసీఆర్ ఎంతటి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఒక్కసారైనా ఆలోచించుకోవాలని సూచించారు. తాను ఎల్లప్పుడూ కేసీఆర్ – కవితలను ఒకరితో ఒకరిని కలపడానికే ప్రయత్నించాను తప్ప, వారి మధ్య దూరం పెంచడానికి కాదని స్పష్టం చేశారు.

పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే మా కుటుంబం
తాము పార్టీలోకి కొత్తగా రాలేదని, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డితో కలిసి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్/బీఆర్‌ఎస్) ఆవిర్భావానికి ముందే కేసీఆర్ వెంటే నడిచామని ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. తాము పార్టీ వ్యవస్థాపక సభ్యులమని పేర్కొంటూ, “బీఆర్‌ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్‌ఎస్” అని ఆయన స్పష్టం చేశారు. కానీ కవిత మాత్రం రాజకీయాల్లోకి మధ్యలో వచ్చి, ఇప్పుడు మళ్లీ దూరమయ్యారని ఎద్దేవా చేశారు. పార్టీ లైన్‌ను ఉల్లంఘించి, నిబంధనలు ధిక్కరించినందుకే ఆమెపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని తెలిపారు.
Vemula Prashanth Reddy: కాంగ్రెస్‌తో రహస్య మంతనాలు ఎవరివి? – యాదగిరిగుట్ట సాక్షిగా సవాల్
అసెంబ్లీ లోపలా, బయటా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసని ప్రశాంత్ రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్ నాయకులతో ఎలాంటి రహస్య మంతనాలు జరపలేదని, దీనిపై తాను యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కవిత ఎలాంటి రహస్య ఒప్పందాలు, మంతనాలు జరపలేదని ఆమె ధైర్యంగా చెప్పగలరా అని నిలదీశారు.
సానుభూతి కోసమే కన్నీళ్లు – అధికార పార్టీకి పరోక్ష లబ్ధి
కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా, పార్టీకి వెన్నెముకగా ఉన్న నాయకులపై నిరాధార ఆరోపణలు గుప్పిస్తూ… పార్టీని బలహీనపరిచేలా కవిత వ్యవహరిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల పరోక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతోందని మండిపడ్డారు. సభలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, ప్రజల నుంచి సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలని విమర్శించారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీ పదవిలో కూర్చోబెట్టడంలో తన పాత్ర ఎంత ఉందో కేసీఆర్‌కు తెలుసని, నిన్నటి వరకు తనపై ఉన్న గౌరవాన్ని కవిత తన అనుచిత వ్యాఖ్యలతో స్వయంగా పోగొట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

