Union Cabinet expansion! :త్వరలో కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేశారని ఢిల్లీ వర్గాల సమాచారం.
జూలైలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల కంటే ముందే ఈ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. పనితీరు సరిగా లేని వారిని, వివాదాల్లో ఉన్న వారిని తప్పించి, సమర్థులతో పాటు 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నేతలకు మరియు కొత్తగా ఎన్డీఏ కూటమిలోకి చేరిన పార్టీల ఎంపీలకు క్యాబినెట్‌లో చోటు కల్పించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయి విస్తరణ ముహూర్తంపై చర్చించారు. దీనికి రెండు రోజుల ముందే ప్రధాని మోదీ కూడా రాష్ట్రపతిని కలిశారు. మరోవైపు, రాజ్యసభ పదవీకాలం ముగియడంతో కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేయడం క్యాబినెట్ విస్తరణ సంకేతాలకు మరింత బలాన్ని చేకూర్చింది. మహారాష్ట్ర శివసేన (ఉద్ధవ్)తో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎంపీలు కొందరు ఎన్డీఏకు మద్దతు తెలపడం వల్ల కూటమి బలం పెరిగింది. పంజాబ్ నుంచి ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన రాఘవ్ ఛద్దా, అశోక్ మిట్టల్‌లలో ఒకరికి లేదా ఇద్దరికీ పదవులు దక్కే అవకాశం ఉంది. ఎస్సీ వర్గ సమీకరణాల్లో భాగంగా మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు తరుణ్ ఛుగ్‌కు, యూపీ ఎన్నికల దృష్ట్యా ‘రామాయణ్’ సీరియల్ ఫేమ్, మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్‌కు మంత్రి పదవులు దక్కవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.
Union Cabinet expansion!
Union Cabinet expansion! : నితీశ్ కుమార్‌కు కీలక శాఖ? శాఖల మార్పిడిపై కసరత్తు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కేంద్ర మంత్రి మండలిలో స్థానం కల్పించడం దాదాపు ఖరారైంది. ఆయన రైల్వే లేదా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలను కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన (యూబీటీ) నుంచి వచ్చిన సంజయ్ దినా పాటిల్‌కు సహాయ మంత్రి పదవి దక్కే సూచనలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆ శాఖ నుంచి తప్పించి విద్యాశాఖకు పంపే యోచనలో ప్రధాని ఉన్నట్లు సమాచారం. విమర్శలు ఎదుర్కొంటున్న ముగ్గురు కీలక నేతలను మంత్రివర్గం నుంచి తొలగించవచ్చని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది:
- ధర్మేంద్ర ప్రధాన్: నీట్ 2026 పేపర్ లీకేజీ వ్యవహారం, సీబీఎస్ఈ 12వ తరగతి మూల్యాంకన తప్పుల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించే అవకాశాలు ఉన్నాయి.
- బండి సంజయ్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడం వివాదాస్పదంగా మారింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటానికి ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించవచ్చని అంటున్నారు.
- హర్దీప్ సింగ్ పురి: వయస్సు 70 ఏళ్లు దాటడం, ఇంధన మరియు పెట్రోలియం శాఖ నిర్వహణలో విఫలం కావడం వల్ల ఈయనను ఇంటికి పంపించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తే, తెలంగాణ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్‌కు అవకాశం ఇచ్చే వీలుంది. మహిళా కోటాలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు మంత్రి పదవి ఖాయమనే నమ్మకంతో ఆమె అనుచరులు ఉన్నారు. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్లను ఆకర్షించేందుకు ఎంపీ ఈటల రాజేందర్ పేరును కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
మళ్లీ 100% సుంకాలతో ట్రంప్ వార్నింగ్.. మరి భారత్ పరిస్థితి ఏమిటి?

