Ponguleti : ఖమ్మం జిల్లా కూసుమంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను 'పెద్ద కాకి'తో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. “బీఆర్ఎస్ పెద్ద కాకి ఫామ్‌హౌస్‌లో పండుకుంటే.. బయట ఉన్న పిల్ల కాకులు పిచ్చి వాగుడు వాగుతున్నాయి” అంటూ ఘాటుగా విమర్శించారు. అధికారం కోల్పోయిన ఓర్వలేక ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, విమర్శలు మాని నిజమైన ప్రతిపక్ష పాత్రను పోషించాలని పొంగులేటి సూచించారు.

అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పాలన: నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని ప్రకటన
ఈ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 1000 రోజుల్లోనే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, హామీలను విజయవంతంగా అమలు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక లోటుపాట్లు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమల్లో వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. కూసుమంచి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు పిచ్చి విమర్శలు చేస్తున్నాయని, వాటికి ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య కాంగ్రెస్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

