Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలపై ఆమె కుమార్తె సుస్మిత పటేల్ చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సాయంత్రంలోగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పెద్దలు సురేఖను ఆదేశించినట్లు సమాచారం.
గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేస్తున్న బహిరంగ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపింది. మరోవైపు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read Also : Singareni Breakfast Scheme: విద్యార్థులకు సింగరేణి బ్రేక్‌ఫాస్ట్ కానుక
Action against Konda Surekha… Congress high command orders her to resign.
Konda Surekha: రాజీనామా లేకుంటే బర్తరఫ్ తప్పదు
ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కొండా సురేఖ సమావేశమైనప్పటికీ ఈ వ్యవహారంపై ఎలాంటి సానుకూల ఫలితం రాలేదని తెలుస్తోంది. సాయంత్రంలోగా స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం ఆమెను ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ రాజీనామా చేయకపోతే గవర్నర్ ద్వారా బర్తరఫ్ చేయించే దిశగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటన అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆమె తన అనుచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ పరిణామాలతో తెలంగాణ కేబినెట్‌తో పాటు కాంగ్రెస్ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ, ఊహాగానాలు నెలకొన్నాయి.

