Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి హబ్‌గా మార్చడమే ధ్యేయంగా రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు సియోల్ నగరంలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కంపెనీల ఉన్నత స్థాయి ప్రతినిధులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆటోమోటివ్ రంగ దిగ్గజం 'హ్యుందాయ్ మోబిస్', సెమీకండక్టర్ల తయారీ సంస్థ 'అపాక్ట్' (ఏపీఏసీటీ) ప్రతినిధులతో మంత్రి జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చేలా కనిపిస్తున్నాయి.

హ్యుందాయ్ మోబిస్ ముందు ఏపీ కీలక ప్రతిపాదనలు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోబిస్' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్, ఇతర అగ్రశ్రేణి అధికారులతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయని, ఈ అద్భుతమైన అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాలని కోరుతూ పలు ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు.
- తిరుపతి లేదా అనంతపురం: ఈ రెండు నగరాల్లో ఏదో ఒక చోట ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలి.
- విశాఖపట్నం: వైజాగ్‌లో హ్యుందాయ్ మోబిస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D), ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
- ఐఐటీ తిరుపతి భాగస్వామ్యం: అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి అధునాతన టెక్నాలజీలపై ఐఐటీ తిరుపతితో కలిసి 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను నిర్మించాలి.
- ఆటోమొబైల్ హబ్‌గా అనంతపురం: అనంతపురాన్ని పూర్తిస్థాయి ఆటోమొబైల్ హబ్‌గా మార్చేందుకు, టైర్-1 సరఫరాదారులతో భారీ సమావేశం నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వంతో చేతులు కలపాలి.

భారత్‌లో హ్యుందాయ్ మోబిస్ విస్తరణ ప్రణాళికలకు ఏపీ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం, రాయితీలు అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన యంగ్ బిన్ కిమ్.. తమ సంస్థ ఇప్పటికే చెన్నై, అనంతపురంలో కియా ఇండియా కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ వంటి కీలక విడిభాగాలను సరఫరా చేస్తోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై తమ ఉన్నతస్థాయి బోర్డుతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Nara Lokesh: విశాఖపట్నంలో రూ. 468 కోట్లతో అపాక్ట్ ఓఎస్ఏటీ యూనిట్
మరో వ్యూహాత్మక భేటీలో, సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ (OSAT) రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన 'అపాక్ట్' (APACT) కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో మంత్రి లోకేశ్ చర్చలు జరిపారు. ఏఎస్ఐపీ టెక్నాలజీస్‌తో జతకట్టి విశాఖపట్నంలో ఓఎస్ఏటీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) నుంచి గతేడాది (ఆగస్టు 12, 2025న) ఇప్పటికే అనుమతులు లభించాయని సియాంగ్ డాంగ్ లీ ఈ సందర్భంగా వెల్లడించారు.
రూ. 468 కోట్ల భారీ పెట్టుబడితో, ఏడాదికి సుమారు 96 మిలియన్ల పరికరాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈ యూనిట్ ఏర్పాటు కానుందని, దీని నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ రంగానికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ అపాక్ట్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఈ ఓఎస్ఏటీ ప్లాంట్‌కు అవసరమైన మానవ వనరుల కోసం యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఏపీఎస్ఎస్‌డీసీ (APSSDC)తో భాగస్వామ్యం కావాలని కోరారు. అలాగే, 'హనా మైక్రాన్' వంటి ఇతర అంతర్జాతీయ ఓఎస్ఏటీ కంపెనీలు కూడా ఏపీ వైపు చూసేలా సహకరించాలని విజ్ఞప్తి చేయగా, అపాక్ట్ సీఈవో సానుకూలంగా స్పందించారు.

