Korutla: జగిత్యాల జిల్లా కోరుట్లలో మంగళవారం నాడు ఊహించని విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. స్థానిక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ అపరిచిత వ్యక్తి దొంగిలించి తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు మరియు ఆర్టీసీ సిబ్బంది సినిమా ఫక్కీలో దాదాపు 18 కిలోమీటర్ల మేర ఆ వాహనాన్ని వెంబడించి, చివరికి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంచలన ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

పోలీసులను పరుగులు పెట్టించిన ఆగంతకుడు
ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సులోకి ఎక్కిన ఒక వ్యక్తి, ఉన్నపళంగా దాన్ని స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు వేగంగా పోనిచ్చాడు. డ్రైవర్ లేకుండా బస్సు ముందుకు కదలడాన్ని చూసిన డిపో సిబ్బంది వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి బస్సును ఛేజ్ చేయడం ప్రారంభించారు.
Korutla: మార్గమధ్యంలో వాహనాలపైకి బస్సు.. తప్పిన పెను ప్రమాదం
పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఆ దొంగ బస్సును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపాడు. ఈ క్రమంలో కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేట గ్రామాల వద్ద మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అంతేకాకుండా, తనను వెంబడిస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని కూడా గుద్దాడు. మెట్‌పల్లి సమీపంలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సును తృటిలో దాటుకుని వెళ్లడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పి ఊపిరి పీల్చుకున్నారు.
చెట్టును ఢీకొట్టి ఆగిన బస్సు.. నిందితుడు అరెస్ట్
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు కీలక వ్యూహం పన్నారు. మెట్‌పల్లి మండలంలోని గండి హనుమాన్ ఆలయ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఇతర వాహనాలను అడ్డంగా పెట్టి బస్సును ఆపేందుకు యత్నించారు. దీంతో కంగారుపడిన సదరు వ్యక్తి బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో, అది రహదారి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టును వేగంగా ఢీకొట్టి ఆగిపోయింది. వెంటనే బస్సులో నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

