New Pensions : తెలంగాణ రాష్ట్రంలో నూతన పింఛన్ల మంజూరుకు సంబంధించి అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, పాత నిబంధనలే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతంలో నిర్వహించిన ప్రజా పాలన వారోత్సవాలు, ప్రజావాణి మరియు గ్రామసభల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా కేటగిరీల వారీగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను (సర్టిఫికెట్లు) సిద్ధంగా ఉంచుకోవాలని లబ్ధిదారులకు సూచించింది.

కేటగిరీల వారీగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలివే
వివిధ వర్గాల లబ్ధిదారులు పింఛను పొందడానికి సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. వితంతు పింఛను కోసం భర్త డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి కాగా, ఒంటరి మహిళలకు లీగల్ సెపరేషన్ కార్డు లేదా స్థానిక విచారణ కమిటీ అందించిన నివేదిక అవసరమవుతుంది. ఇక చేనేత కార్మికులు జౌళి శాఖ నుండి, గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ నుండి పొందిన సర్టిఫికెట్లను జతచేయాల్సి ఉంటుంది. ఫైలేరియా, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాధితులు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన వైద్య ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

