Kothagudem Airport : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన విమానాశ్రయ ఏర్పాటు దిశగా ఒక కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది.
గతంలో అధికారులు పరిశీలించిన రెండు ప్రాంతాలు సాంకేతిక పరంగా, రన్‌వే నిర్మాణానికి అనుకూలంగా లేవని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను ప్రాథమికంగా ఎంపిక చేసింది. ఈ కొత్త ప్రదేశాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించనుంది.
కేంద్ర మంత్రి హామీ: పారిశ్రామిక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు మహర్దశ
కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన అనంతరం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వివరాలను వెల్లడించారు. కేంద్ర బృందం ఇచ్చే భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నివేదిక ఆధారంగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి తదుపరి చర్యలు వేగవంతం చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయం సందర్శనకు వచ్చే భక్తులకు, వ్యాపారవేత్తలకు ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగై, ఈ ప్రాంత సమగ్ర ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని భావిస్తున్నారు.

