BRS Leaders: కృష్ణ, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించేందుకు మాజీ మంత్రులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో పాలమూరు బీఆర్‌ఎస్ (BRS) శ్రేణులు క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరాయి.ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సి.
లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రాజెక్టులను కాపాడుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని, పాలమూరుకు అన్యాయం చేస్తున్న వారిని నిలదీసేందుకే ఈ పరిశీలనా కార్యక్రమాన్ని చేపట్టినట్లు స్పష్టం చేశారు.
పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు - మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై ఎలాంటి శ్రద్ధ లేదని డాక్టర్ సి. లక్ష్మారెడ్డి విమర్శించారు. తాము పాదయాత్ర చేపడతామని ప్రకటించిన రెండున్నర ఏళ్ల తర్వాత ప్రభుత్వం అరకొరగా సమీక్షలు నిర్వహించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కృష్ణా, తుంగభద్ర, మరియు భీమా నదుల జలాలను పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రా దోచుకుంటున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు.ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల నీటి హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉందని, ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి మన హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

BRS Leaders: పాలమూరు జిల్లాను ఎడారి కానీయం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పాలమూరు జిల్లా దశ దిశను మార్చిందని గుర్తుచేశారు. ఉమ్మడి పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు తాగు, సాగునీటి కోసం తీవ్ర గోస పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను గతంలో తీవ్రంగా అడ్డుకున్న ఆదిత్యనాథ్‌ను చంద్రబాబు నాయుడు సూచన మేరకే రేవంత్ రెడ్డి ఇరిగేషన్ సలహాదారుగా నియమించుకున్నారని ఆరోపించారు.పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చే కుట్రలను బీఆర్‌ఎస్ గట్టిగా అడ్డుకుంటుందని, రాష్ట్ర హక్కులను కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com

