Kumki Elephants : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పంటలను నాశనం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల బెడదను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా 'కుంకీ' ఏనుగులను రంగంలోకి దించింది.
అమరావతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ కుంకీ ఏనుగులకు సంప్రదాయబద్ధంగా పూలు జల్లి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వయంగా వాటికి చెరకు గడలను తినిపించి ఆప్యాయతను చాటుకున్నారు. అడవి ఏనుగులను దారికి తెచ్చేందుకు, గ్రామాల్లోకి రాకుండా అడవుల్లోకి మళ్లించేందుకు శిక్షణ పొందిన ఈ కుంకీ ఏనుగుల సేవలు ఎంతో కీలకమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల కట్టడికి చర్యలు
ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో అడవి ఏనుగుల గుంపులు తీవ్రంగా సంచరిస్తూ పంట పొలాలను, ఇళ్లను ధ్వంసం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు శాశ్వత లేదా సమర్థవంతమైన పరిష్కారం చూపడంలో భాగంగానే ఈ ప్రత్యేక కుంకీ ఏనుగులను పార్వతీపురం ప్రాంతానికి పంపిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతుల పంట నష్టాన్ని నివారించడంతో పాటు గిరిజన గ్రామాల ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అటవీ శాఖ అధికారులతో సమీక్షించి, ఏనుగుల దాడులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటి సేవలను తక్షణమే అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు.

