NDA Government | శ్రీకాకుళం, జూన్ 19: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేశామని, మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
Read Also: Rental rules: అద్దెదారులకు శుభవార్త.. కేంద్రం కొత్త నిబంధనలు
జిల్లాకు ప్రతిష్టాత్మకమైన మూలపేట అంతర్జాతీయ పోర్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పలాస ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నేరడి బ్యారేజ్ అంతర్రాష్ట్ర వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి గెజెట్ నోటిఫికేషన్ సాధించామని వెల్లడించారు. వంశధార, నాగవళి, బహుదా, మహేంద్రతనయ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్రంలో ఏర్పడిన పెట్టుబడి అనుకూల వాతావరణంతో దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని, వాటి ద్వారా యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ₹3,300 కోట్ల వ్యయంతో 54 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులకు ఆమోదం లభించిందని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ గణాంకాలు వివరించిన కలెక్టర్
సభలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికను సమర్పించారు. మూలపేట పోర్టు మౌలిక వసతుల పనులు ఇప్పటికే 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలులో భాగంగా:
- స్త్రీ శక్తి పథకం కింద 231.12 లక్షల మంది మహిళలకు ₹86.79 కోట్లు వ్యయంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.
- అన్నదాత సుఖీభవ కింద 2,79,100 రైతు కుటుంబాలకు ₹526.63 కోట్లు.
- తల్లికి వందనం పథకం కింద 2,54,408 మంది తల్లుల ఖాతాల్లో ₹381.61 కోట్లు.
- దీపం-2.0 కింద 3,99,220 మంది లబ్ధిదారులకు ₹31.22 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.
NDA Government: ప్రజాప్రతినిధుల ప్రసంగాలు
సభకు అధ్యక్షత వహించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టును త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ విప్ బెందాలం అశోక్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూటమి ప్రభుత్వ విజయాలను కొనియాడారు.
Alliance government’s victory celebration in Srikakulam
ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు పొందిన కొత్తూరుకు చెందిన సిహెచ్ గాయత్రి, పోలాకికి చెందిన దుర్గాప్రసాద్ తమ అనుభవాలను పంచుకున్నారు. జర్మన్ భాషా శిక్షణతో బహుళజాతి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, జనసేన జిల్లా అధ్యక్షుడు పీసిని చంద్రమోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

