TTD updates:తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అర్ధరాత్రి సమయంలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేయడం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల వద్ద రాత్రి పన్నెండు గంటల సమయంలో టోకెన్లు ఇవ్వడంతో భక్తులు తీవ్ర అష్టకష్టాలు పడుతున్నారు.
కేవలం గంటన్నర వ్యవధిలోనే పది వేల టోకెన్లు పూర్తికావడంతో వేలాదిమంది నిరాశ చెందుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు చంటి పిల్లలు వృద్ధులతో కలిసి రాత్రంతా క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
Read also: AP NTR Bharosa pensions: అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త పింఛన్ల పంపిణీ
Issuance of Sarva Darshan tokens in Tirumala
టోకెన్ల పంపిణీలో అధికారుల వైఫల్యం
గత నెల రోజులుగా అర్ధరాత్రి పూట టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి మార్పులు చేయడం లేదు. సుమారు ఇరవై ఏడు వేల మంది భక్తులు వేచి ఉండగా పది వేల టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. శ్రీవారి మెట్టు మార్గంలో కేవలం రెండు వేల టోకెన్లు మాత్రమే కేటాయించారు. వసతులు లేక చలిలో రోడ్లపై గడపాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.
TTD updates:సమస్య పరిష్కారానికి భక్తుల డిమాండ్లు
అర్ధరాత్రి టోకెన్ల విధానాన్ని రద్దు చేసి ఉదయం వేళల్లో కేటాయించాలని భక్తులు కోరుతున్నారు. పది వేల టోకెన్ల కోటాను కనీసం ఇరవై ఐదు వేలకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మిగిలిన భక్తులను నేరుగా తిరుమలకు అనుమతించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తాగునీరు మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కల్పించాలి. ఉన్నతాధికారులు స్పందించి భక్తుల కష్టాలను శాశ్వతంగా తొలగించాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.
Epaper: epaper.vaartha.com

