BCI : లా విద్యార్థుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు, జారీ చేసిన ఆదేశాలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా విచారం వ్యక్తం చేశారు.
2026 బ్యాచ్ లా గ్రాడ్యుయేట్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో విద్యార్థుల మనోభావాలు దెబ్బతిని (BCI) ఉంటే తనను క్షమించాలని ఆయన బహిరంగంగా కోరారు.
రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో న్యాయవాదులుగా నమోదు చేయకుండా :
ఈ వివాదం హైదరాబాద్‌లోని NALSAR యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థుల విషయంలో BCI తీసుకున్న నిర్ణయంతో మొదలైంది. యూనివర్సిటీ 2026 గ్రాడ్యుయేట్లను రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో న్యాయవాదులుగా నమోదు చేయకుండా తాత్కాలికంగా ఆదేశాలు జారీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థులు, న్యాయవాదులు, పలు న్యాయ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం BCI ఆ ఆదేశాన్ని వెనక్కి తీసుకుంది.

విద్యార్థుల ఆందోళనలపై స్పందిస్తూ మిశ్రా.. క్షమాపణ చెప్పడం తన ప్రతిష్టకు లేదా అహంకారానికి సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు మన వ్యవస్థలో కీలక భాగమని, వారి భావోద్వేగాలు, ఆందోళనలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. సమస్యలను ఉద్రిక్తతల ద్వారా కాకుండా పరస్పర చర్చలు, సంభాషణల ద్వారా పరిష్కరించుకోవాలని కూడా ఆయన సూచించారు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా BCI జోక్యంపై ప్రశ్నలు లేవనెత్తినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు NALSAR పూర్వ విద్యార్థులు కూడా విద్యార్థుల అభిప్రాయ స్వేచ్ఛ, నిరసన హక్కులను గౌరవించాలని కోరారు. తాజా క్షమాపణతో వివాదానికి కొంతమేర తెరపడుతుందా, విద్యార్థులు మరియు BCI మధ్య నెలకొన్న విభేదాలు ఎలా పరిష్కారమవుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

