Lucknow Fire Accident: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నిన్న మధ్యాహ్నం ఒక వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అలీగంజ్ పరిధిలోని ఉషా మెహతా మార్గంలో ఉన్న ఓ మూడంతస్తుల కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పలువురు ప్రస్తుతం నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
కోచింగ్ సెంటర్‌ను చుట్టుముట్టిన పొగ.. ప్రాణాలు కాపాడుకునేందుకు దూకేసిన విద్యార్థులు
ప్రమాదం జరిగిన సమయంలో భవనంలోని గ్రాఫిక్స్ యానిమేషన్ కోచింగ్ సెంటర్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. అదే కాంప్లెక్స్‌లో లైబ్రరీ, గేమింగ్ జోన్ కూడా నడుస్తుండటంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మంటలు వ్యాపించడంతో క్షణాల్లోనే భవనమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో లోపల ఉన్నవారికి ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణభయంతో కొందరు విద్యార్థులు భవనం పై అంతస్తుల నుండి కిందకు దూకేశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
స్పందించిన పీఎం మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్.. భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఈ తీవ్ర విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక పర్యటనలను రద్దు చేసుకుని నేరుగా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రంగంలోకి సిట్ (SIT).. నలుగురు అధికారుల సస్పెన్షన్, నలుగురి అరెస్ట్
ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ప్రభుత్వ అధికారులను తక్షణమే సస్పెండ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, భవన యజమానులతో సహా నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
read also:

