Kalyan Ram : టాలీవుడ్ దర్శకుడు పరశురాం మరోసారి వార్తల్లో నిలిచారు. 'యువత' సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన 'గీత గోవిందం'తో భారీ విజయాన్ని అందుకుని స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరారు.
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు, వినోదంతో కూడిన ఎమోషనల్ టచ్ ఆయన చిత్రాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
మహేష్ బాబుతో సర్కారు వారి పాట :
ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ మంచి వసూళ్లు సాధించినప్పటికీ, పరశురాం కెరీర్‌ను ఊహించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేకపోయింది. అనంతరం విజయ్ దేవరకొండతో చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ పై భారీ అంచనాలు నెలకొన్నా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

దీంతో పరశురాం తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పరశురాం తన తదుపరి సినిమాను నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, కథ కూడా కళ్యాణ్ రామ్‌కు నచ్చిందని ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
కళ్యాణ్ రామ్ కూడా ఇటీవల విభిన్న కథలకు ప్రాధాన్యత ఇస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. పరశురాం శైలికి తగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు కమర్షియల్ అంశాలు కలిసిన కథ సిద్ధమైతే ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఇవన్నీ పరిశ్రమలో వినిపిస్తున్న ప్రచారాలే. పరశురాం లేదా కళ్యాణ్ రామ్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

