Telangana: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల ఆర్థిక పరిస్థితికి ఎంతో మేలు చేస్తుందని కేంద్ర గణాంక శాఖ స్పష్టం చేసింది.
కేంద్రం విడుదల చేసిన ‘నేషనల్ హౌస్‌హోల్డ్ ట్రావెల్ సర్వే 2025-26’ నివేదిక ప్రకారం, ఈ పథకం మహిళా ప్రయాణికులకు భారీగా ఆర్థిక ఊతమిస్తున్నట్లు వెల్లడైంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల మహిళల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గాయని ఈ సర్వే పేర్కొంది.

తగ్గిపోయిన మహిళల ప్రయాణ ఖర్చులు.. జాతీయ సగటు కంటే తక్కువ
ఈ సర్వే వివరాల ప్రకారం, తెలంగాణలో మహిళల సగటు ప్రయాణ ఖర్చు కేవలం రూ.420కి మాత్రమే పరిమితమైంది. ఇది దేశవ్యాప్తంగా నమోదైన జాతీయ సగటు రూ.533 కంటే చాలా తక్కువగా ఉండటం విశేషం. ఉచిత బస్సు పథకం పుణ్యమా అని మహిళలు తమ దైనందిన ప్రయాణాల కోసం పెద్దగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తప్పిందని, తద్వారా వారి కుటుంబ బడ్జెట్‌కు ఎంతో ఉపశమనం లభిస్తోందని నివేదిక తెలపింది.
Telangana: రూ.12,650 కోట్లు ఆదా.. రాష్ట్రంలో భారీగా పెరిగిన ప్రయాణాలు
తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 365 కోట్ల ప్రయాణాలు రికార్డయ్యాయి. దీని ద్వారా రాష్ట్రంలోని మహిళలకు మొత్తంగా సుమారు రూ.12,650 కోట్ల రూపాయల మేర భారీగా ఆదా అయినట్లు సర్వే వెల్లడించింది. అయితే, ఇదే సమయంలో రాష్ట్రంలో పురుషుల ప్రయాణ ఖర్చులు మాత్రం జాతీయ సగటు కంటే కాస్త ఎక్కువగా నమోదవడం గమనార్హం.

