Thailand Footballer: థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో 24 ఏళ్ల సోఫ్వాన్ అవే అనే యువ ఆటగాడు దుర్మరణం చెందాడు.
దక్షిణ థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ ఘటనలో మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వర్షం పడుతున్నా మ్యాచ్‌ను నిలిపివేయకుండా కొనసాగించడంపై, ఆ తర్వాత మైదానంలో పిడుగుపడి ఆటగాడు ప్రాణాలు కోల్పోవడంపై సోషల్ మీడియాలో నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక ‘గోలోక్ ఎఫ్ఏ కప్’ టోర్నమెంట్‌లో భాగంగా సోఫ్వాన్ అవే ప్రాతినిధ్యం వహిస్తున్న ‘శామ్‌కోల్ట్స్’ జట్టు, ‘అబూ ఎక్స్ నాంగ్ సిరిన్’ జట్టు మధ్య పోరు జరుగుతోంది. వర్షం కురుస్తున్నప్పటికీ ఆటను కొనసాగించగా, ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ పిడుగు మైదానంలో పడింది. పిడుగుపాటు దాటికి సోఫ్వాన్ అక్కడికక్కడే స్పాట్‌లోనే కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు, మైదాన సిబ్బంది వెంటనే అతడి వద్దకు పరుగులు తీసినా ఫలితం లేకుండా పోయింది.
Read Also : Jos Buttler: బట్లర్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టేది ఆ కుర్రాడేనట
Tragedy on the field: Football player dies after being struck by lightning.
Thailand Footballer: అత్యవసర వైద్యం అందించినా దక్కని ప్రాణాలు
ఈ ప్రమాదంపై స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంత్ మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో అత్యవసర వైద్య బృందాలు సీపీఆర్ (CPR), ఇతర ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, తీవ్ర గాయాల వల్ల సోఫ్వాన్ ప్రాణాలు కాపాడలేకపోయినట్లు వెల్లడించారు. మలేషియాకు చెందిన ‘బెర్నామా’ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. సోఫ్వాన్ మృతి పట్ల థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి, క్లబ్‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాను, వర్షం లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మ్యాచ్‌లను తక్షణమే నిలిపివేసేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.థాయ్‌లాండ్‌లో పిడుగుపాట్లు సాధారణంగా మారాయి. అక్కడి వ్యాధుల నియంత్రణ విభాగం డేటా ప్రకారం 2020 నుంచి 2024 మధ్య కాలంలో దేశంలో ఏకంగా 283 మంది పిడుగుపాటుకు గురయ్యారని సమాచారం.

