Ap local body elections 2026: వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మైదుకూరులో నామినేషన్ పత్రాలను చించేయడం వల్ల..
వాటి పరిశీలన కష్టమని తేలడంతో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు.
AP Municipal Elections: 8 ఛైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయా?
జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మైదుకూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి త్వరలో మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. విజయవాడలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోనే మైదుకూరు మున్సిపల్ ఎన్నికల వాయిదా గురించి ఎస్‌ఈసీ ఈ ప్రకటన చేశారు.

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్:
ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలో 663 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 659 స్థానాలకు, అలాగే 9,859 ఎంపీటీసీ స్థానాలకు గాను 9,829 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు కలిపి 10,488 స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల ముఖ్యమైన తేదీలు:
నామినేషన్ల స్వీకరణ: ఈ నెల 21 నుంచి 23 వరకు
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24
తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ: అక్టోబర్ 25
అప్పీళ్ల పరిష్కారం: అక్టోబర్ 26
నామినేషన్ల ఉపసంహరణకు గడువు & పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన: అక్టోబర్ 27
పోలింగ్ తేదీ: నవంబర్ 3 (అవసరమైతే నవంబర్ 4న రీపోలింగ్)
ఓట్ల లెక్కింపు & ఫలితాల వెల్లడి: నవంబర్ 5
వ్యయ పరిమితి
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి.. ఎంపీటీసీ అభ్యర్థి రూ. 4 లక్షల వరకు, జెడ్పీటీసీ అభ్యర్థి రూ. 8 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఉంది. మొత్తంమీద జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయ వర్గాల్లో నామినేషన్ల సందడి మొదలైంది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుండటంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా దృష్టి పెట్టాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

