UPI : ఒకప్పుడు చేతిలో నగదు లేకపోతే ఇబ్బంది. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో చెల్లింపు పూర్తవుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పదేళ్లు పూర్తి చేసుకుంది.
2016 ఆగస్టు 25న ప్రజలకు అందుబాటులోకి వచ్చిన యూపీఐ.. నేడు భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షణలో అభివృద్ధి చేసింది.
బ్యాంకులు, యాప్స్‌తో మొదలైన ఈ వ్యవస్థ :
ప్రారంభంలో పరిమిత సంఖ్యలో బ్యాంకులు, యాప్స్‌తో మొదలైన ఈ వ్యవస్థ.. క్రమంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల రోజువారీ జీవితంలో భాగమైంది. మొబైల్ నంబర్, UPI ID లేదా QR కోడ్ ద్వారా క్షణాల్లో డబ్బు పంపడం, స్వీకరించడం సాధ్యమైంది. చిన్న దుకాణం నుంచి పెద్ద వ్యాపారం వరకు నగదు రహిత చెల్లింపులకు యూపీఐ కొత్త దారిని చూపించింది.

యూపీఐ వృద్ధిని గణాంకాలే చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, NPCI వివరాల ప్రకారం 2016-17లో కేవలం 1.78 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2025-26 నాటికి ఈ సంఖ్య ఏకంగా 24,161.69 కోట్లకు చేరింది. అంటే దాదాపు 13,000 రెట్ల వృద్ధి. అదే సమయంలో లావాదేవీల విలువ 0.07 లక్షల కోట్ల నుంచి సుమారు314 లక్షల కోట్లకు పెరిగింది.
తాజా గణాంకాలు కూడా యూపీఐ దూకుడును స్పష్టం చేస్తున్నాయి. 2026 జూలైలోనే 741 బ్యాంకులు యూపీఐ నెట్‌వర్క్‌లో ఉండగా, 23,658.35 మిలియన్ అంటే సుమారు 2,365.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ 29.88 లక్షల కోట్లకు చేరింది. దేశీయ చెల్లింపులకే పరిమితం కాకుండా యూపీఐ అంతర్జాతీయంగానూ విస్తరిస్తోంది. ప్రస్తుతం పలు దేశాల్లో దీనికి ఆమోదం లభించడంతో భారత డిజిటల్ పేమెంట్ మోడల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతోంది.
పదేళ్లలో యూపీఐ సాధించిన ప్రయాణం కేవలం టెక్నాలజీ విజయమే కాదు.. వేగవంతమైన, సులభమైన, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ సాధించిన కీలక ముందడుగు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు, అంతర్జాతీయ వినియోగంతో యూపీఐ ప్రభావం మరింత విస్తరించే అవకాశముంది.

