Sangareddy Accident:కళ్ల ముందే ఒక మనిషి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకుండా, రోడ్డుపై పడిన వెల్లుల్లి (ఎల్లిపాయల) సంచులను దొంగిలించడానికి జనాలు పోటీ పడిన ఘోర సంఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
రోజురోజుకూ సమాజంలో మానవత్వం ఎంతలా దిగజారిపోతుందో చెప్పడానికి ఈ సంఘటన అద్దం పడుతోంది. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి వద్ద జాతీయ రహదారి 161 (NH 161) ఫ్లైఓవర్‌పై చోటుచేసుకున్న ఈ విచారకరమైన ఘటన.
Read Also :Gang-Rape OnTribal Woman : గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం - ముగ్గురి అరెస్టు
డివైడర్‌ను ఢీకొట్టిన లారీ - డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మహారాష్ట్ర వైపు నుండి వెల్లుల్లి లోడుతో వస్తున్న ఒక లారీ మామిడిపల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమబ్బులో ఉండటంతో లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టి పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం తీవ్రంగా ధ్వంసమై డ్రైవర్ తీవ్ర గాయాలతో రక్తం మడుగులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు.
మానవత్వం ముసుగులో దొంగతనం - రోడ్డుపై దోపిడీ
ప్రమాదం జరగగానే అక్కడికి చేరుకున్న కొందరు స్థానికులు, బాటసారులు గాయపడిన డ్రైవర్‌ను రక్షించాల్సింది పోయి తమ స్వార్థ బుద్ధిని బయటపెట్టుకున్నారు. లారీలో ఖరీదైన వెల్లుల్లి లోడ్ ఉండటంతో, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన సంచులను ఎత్తుకెళ్లడానికి జనాలు ఎగబడ్డారు. మరికొందరైతే ఏకంగా బోల్తా పడిన లారీ పైకి ఎక్కి వెల్లుల్లి సంచులను కిందకు పడేస్తూ చేతికి దొరికినంత దోచుకెళ్లారు. దొంగిలించిన వెల్లుల్లి సంచులను ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వేసుకుని ఇళ్లకు తరలించుకుపోయారు. అటుగా వెళ్తున్న కొందరు మంచితనం ఉన్న వాహనదారులు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Sangareddy Accident:పోలీసులు రంగ ప్రవేశం - వీడియో వైరల్
విషయం తెలుసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనానికి పాల్పడుతున్న వారిని చెదరగొట్టారు. క్రేన్ సహాయంతో బోల్తా పడిన లారీని పక్కకు తొలగించి, జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడకుండా వెల్లుల్లి సంచులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది తీవ్రంగా వైరల్ అయ్యింది. జనాల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

