Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మసకబారుతున్న దర్యాప్తు సంస్థ ప్రతిభ

మసకబారుతున్న దర్యాప్తు సంస్థ ప్రతిభ

వార్త 2 months ago

Fading Credibility of Investigative Agencies: దేశంలోను, రాష్ట్రంలోను నేరాలు, ఆర్థిక కుంభకోణాలను పర్యవేక్షించే ప్రత్యేక దర్యాప్తు సంస్థల ప్రతిభ గత కొంతకాలంగా మసకబారుతోంది.

దర్యాప్తులో తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్రంలో సిట్, సిఐడి వంటి సంస్థలు తమ దర్యాప్తును మెరుగు పరచుకోలేకపోతున్నాయని అర్థం అవుతోంది. ఇటీవల వరుస ఘటనలు పరిశీలిస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా దర్యాప్తు వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. వందల కేసుల్లో దర్యాప్తు దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాయి. ఆలస్యంగా వచ్చే తీర్పు బాధితులకు ఏమాత్రం ఉపశమనం ఇవ్వదన్న సందేశం ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు సంస్థల వ్యవహార శైలిని ఎత్తిచూపుతోంది. తాజా ఘటనలు పరిశీలిస్తే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సరైన ఆధారాలను న్యాయస్థానం ముందు సిబిఐ ప్రవేశపెట్టలేకపోయింది. ఈ విషయాన్ని సిబిఐ కోర్టు కొంత తీవ్రంగానే మందలించింది. అంతే కాకుండా. దర్యాప్తు అధికారులపై తీరుపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని తీవ్రపదజాలాన్ని కూడా ఉపయోగించింది.

Fading Credibility of Investigative Agencies:కాలం మారుతున్నా మారని దర్యాప్తు వేగం

రాజకీయాల్లో అత్యంత కీలకస్థానాల్లో ఉన్న వ్యక్తులను ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ సిబిఐ కేసు దర్యాప్తు చేసింది. చివరకు ఎటూ తేలకుండా ఛార్జిషీటు వేయడంతో అది సిబిఐ కోర్టులో వీగిపోయింది. ఈ కేసు రాజకీయ పార్టీల మనుగడను సైతం తల్లకిందులు చేసింది. చివరకు నిందితులపై మోపిన నేరారోపణలు దర్యాప్తు సంస్థ రుజువు చేయలేకపోయిం దని న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ ఆదేశాలపై సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. ఇక మన రాష్ట్రంలో అయేషా మీరా కేసు కూడా ఇదేవిధంగా కొనసాగింది. దశాబ్దాల తరబడి పోలీసు వ్యవస్థకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు పరిశోధన జరిపినా ఇప్పటి వరకు ఏమాత్రం ఫలితం కనిపించలేదు. చివరకు ఆధారాలు లేవు కాబట్టి కేసును ముగించడమే మార్గమని తేల్చాయి. అయేషా మీరాను ఎవరు హత్య చేశారన్న విషయం ఇప్పటివరకు తేలలేదు.

ఏళ్ల తరబడి కొలిక్కిరాని సంచలన కేసులు: వివేకా హత్య, అయేషా మీరా

సత్యంబాబును బాధ్యు డిని చేసి జైలుకు పంపినా సరైన ఆధారాలు చూపలేకపో యారని అతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఆ తరు వాత సిబిఐ ప్రతిష్టాత్మకంగా ఈ కేసు దర్యాప్తును చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. ఇక రాజకీయ సంచలనం కలిగించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఇప్పటికీ మిస్టరీగానే నిలిచింది. హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకున్నా దర్యాప్తు సంస్థ ముందుకు సాగే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే హత్య జరిగి పదేళ్లు అవుతుందటంతో దర్యాప్తు పై నీలినీడలు అలుముకున్నాయి. సిబిఐ చేపట్టిన అనేక కేసులు కొనసాగుతూనే ఉన్నాయి.ఓబులాపురం గనుల కేసు, మాజీ ముఖ్యమంత్రి జగన్ క్విడ్ కేసు కూడా ఇదే చందాన కొనసాగుతూనే ఉంది. రాజకీయాలకు, వత్తిళ్లకు దూరంగా ఉంటూ దర్యాప్తును కొనసాగించే సత్తా సిబిఐ ఉందని ఒకప్పుడు చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.

దర్యాప్తు సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకత

వివిధ రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాలు, హత్యల కేసులు కూడా ఇదేవిధంగా సంవత్సరాల పడి కొనసాగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రస్థాయిలో ఉన్న సిఐడి కూడా అనేక కేసుల్లో సరైన సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు రుజువుచేయలేకపోయింది. దీనితో దర్యాప్తు సంస్థలపై బాధితులకు, ప్రజలకు నమ్మకాలు సడలుతున్నాయి. విదేశాల్లో డిటెక్టివ్ సంస్థలు చురుగ్గా ఉంటాయి, పోలీసు వ్యవస్థతో సమాంతరంగా అవి దర్యాప్తు సాగిస్తాయి. అనేక సందర్భాల్లో పోలీసుల కంటే ముందుగా దర్యాప్తు నివేదికలు సిద్ధం చేసి నిందితులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని న్యాయస్థానాల ముందు ఉంచుతుంటాయి. అయితే మన దేశంలో అలాంటి పరిస్థితులు లేవు. ఇక్కడ ఉన్న కొన్ని డిటెక్టివ్ సంస్థలు కేవలం కుటుంబ, ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో మాత్రమే నిమగ్నమై ఉంటున్నాయి.తప్పు చేసిన వ్యక్తికి తప్పనిసరిగా శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజల్లో కలిగితే నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సాక్షులు, బాధితులు కూడా ధైర్యంగా దర్యాప్తు సంస్థల ముందుకు వచ్చి కేసులకు సంబంధించిన ఆధారాలు ఇవ్వడం జరుగుతుంది. దర్యాప్తు సమర్థవంతంగా జరగడం లేదన్న అపనమ్మకం ప్రజల్లో కలిగితే నేరస్తులు శిక్షలు పడకుండా తప్పించుకునే పరిస్థితిలు ఏర్పడుతాయి.

డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ

Hindi: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తెలంగాణలో తెలుగుకు పట్టం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha