Mega DSC 2025: మెగా డీఎస్సీ 2025 (Mega DSC 2025) ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న సీబీఐ (CBI) విచారణ డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా తిరస్కరించారు.
విపక్షాలు లేవనెత్తిన ప్రతి ఆరోపణకూ ప్రభుత్వ అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆధారాలతో సమాధానాలు ఇచ్చారని ఆయన తేల్చిచెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడారు.
Read Also :Nagababu: ఏపీ ప్రభుత్వంలో నాగబాబుకు కేబినెట్ హోదా
సీఎం చంద్రబాబు ప్రసంగంలోని కీలక పాయింట్లు

- 355 కోర్టు కేసులను అధిగమించి నియామకాలు: ప్రతిపక్షాలు 355 కోర్టు కేసులు వేసి అడ్డంకులు సృష్టించినప్పటికీ, కేవలం ఏడాది వ్యవధిలోనే 14,000 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు.
- పవన్ కళ్యాణ్‌తో కలిసి నియామక పత్రాలు: ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను, వారి కుటుంబాలను పిలిచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఘనంగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేసి ఆశీర్వదించినట్లు గుర్తుచేశారు.
- ఉపాధ్యాయుల కుటుంబాల్లో అలజడి: నియామకాలు పూర్తయి ఏడాది గడిచాక కూడా అక్రమాలు జరిగాయంటూ అసత్య ప్రచారాలు చేస్తూ, ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల కుటుంబాల్లో గందరగోళం సృష్టించి వారిని అవమానించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
Mega DSC 2025: సీబీఐ విచారణపై సీఎం ప్రశ్నలు
- అధికారులు 10 సార్లు సమాధానమిచ్చారు: విపక్షాలు ఎన్నిసార్లు ప్రశ్నించినా అధికారులు అన్నిటికీ పారదర్శకంగా ఆధారాలతో సహా 10 సార్లు సమాధానాలు ఇచ్చారని స్పష్టం చేశారు. “ఆధారాలు లేని ఈ అసత్య ప్రచారాలకు సీబీఐ విచారణ ఏంటి?” అని ప్రశ్నించారు.
- న్యాయస్థానాల్లోనూ ఆధారాలు లేవు: ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టుల పరిధిలో ఉందని, ఆరోపణలను రుజువు చేసే సరైన ఆధారాలు కోర్టు ముందు కూడా లేవని తెలిపారు.
- అసెంబ్లీకి రారు.. కోర్టులను నమ్మరు: “కోర్టుల పరిశీలనలను ఆమోదించరు, అసెంబ్లీకి వచ్చి చర్చించరు.. మీరేం చెబితే అదే వేదమా?” అని ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని చట్టబద్ధమైన ప్రక్రియలను పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించామని, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే దుష్ప్రచారాలను సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు.

