Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెహర్ రమేశ్ ఇంట సందడి.. పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖుల రాక

మెహర్ రమేశ్ ఇంట సందడి.. పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖుల రాక

వార్త 3 weeks ago

Meher Ramesh: టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన కుమార్తె మోహన పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుధ్‌తో మోహన వివాహం జరిగింది. ఇటీవల ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరగ్గా, తాజాగా వీరిద్దరూ కల్యాణ బంధంతో ఒకటయ్యారు.

మెగా సందడి: ఆశీర్వదించిన చిరంజీవి దంపతులు, పవన్ కల్యాణ్

ఈ ఘనమైన వివాహ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రముఖ రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి హాజరై నూతన వధూవరులను దీవించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తన భార్య అన్నా లెజెనోవాతో కలిసి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పెళ్లికి సంబంధించిన మెగా ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Meher Ramesh: సినీ, రాజకీయ ప్రముఖుల కోలాహలం

సినీ పరిశ్రమ నుంచి అగ్ర హీరో వెంకటేశ్ దంపతులు, ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, ఎన్. శంకర్, వీర శంకర్ తదితరులు విచ్చేశారు. అలాగే అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, సి. అశ్వినీదత్, ఏఎం రత్నం, బన్నీ వాసు, సీనియర్ నటుడు మురళీ మోహన్, ప్రముఖ రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, ప్రముఖ యాంకర్ సుమ కనకాల తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. రాజకీయ రంగం నుంచి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, గంటా శ్రీనివాస్, అంబటి రాంబాబు వంటి పలువురు నేతలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు.

మెగా కుటుంబంతో మెహర్ రమేశ్‌కు ఉన్న ప్రత్యేక బంధం

దర్శకుడు మెహర్ రమేశ్‌కు మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితమైన బంధుత్వం ఉంది. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి, మెహర్ రమేశ్ తల్లి ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. ఈ క్రమంలో చిన్నప్పటి నుంచే చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లతో మెహర్ రమేశ్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. మెగా కుటుంబంలో జరిగే ఏ వేడుకలోనైనా ఆయన చురుగ్గా పాల్గొంటారు. ఇటీవల కాలంలో చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన 'భోళా శంకర్' చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించారు.

కన్నడ టు టాలీవుడ్.. మెహర్ రమేశ్ సినీ ప్రస్థానం

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసోసియేట్‌గా సినీ ప్రయాణం ప్రారంభించిన మెహర్ రమేశ్.. కన్నడలో 'వీరకన్నడిగ', 'అజయ్' వంటి సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'కంత్రి', రెబల్ స్టార్ ప్రభాస్‌తో 'బిల్లా', విక్టరీ వెంకటేశ్‌తో 'షాడో' చిత్రాలను తెరకెక్కించారు. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబుతోనూ ఆయనకు మంచి స్నేహం ఉంది. గతంలో మహేశ్ బాబు హీరోగా నటించిన 'బాబీ' సినిమాలో ఆయన ఒక చిన్న పాత్రలోనూ మెరిశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha