Meta Apology : ప్రధాని నరేంద్ర మోదీ జులై 23న పోస్ట్ చేసిన వీడియోను ఫేస్‌బుక్ నుంచి తాత్కాలికంగా తొలగించడంపై పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంలో మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 3 రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ గడువులోగా స్పందించకపోతే ఐటీ చట్టం ద్వారా భారత్‌లో మెటా పొందుతున్న ‘సేఫ్ హార్బర్’ (Safe Harbor) రక్షణను ఉపసంహరిస్తామని కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించే దేశ ప్రధాని వీడియోను 5-6 గంటల పాటు బ్లాక్ చేయడం సాధారణ సాంకేతిక లోపం కాదని, ఇది ప్రజాస్వామ్యం మరియు జాతీయ భద్రతపై జరిగిన దాడి అని పార్లమెంటరీ సంఘం పేర్కొంది. కేవలం మెటా మాత్రమే కాకుండా ఎక్స్ (ట్విట్టర్), గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు భారత చట్టాలకు, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. చిన్నారులపై లైంగిక వేధింపులు, మహిళలను కించపరిచే కంటెంట్‌ను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించింది.
Read also: Delimitation bill: త్వరలో డీలిమిటేషన్ బిల్లు ప్రత్యేక భేటీ?
Meta Apology
Meta Apology : ఐటీ మంత్రిత్వ శాఖతో మెటా గ్లోబల్ టీమ్ భేటీ
ఈ ప్రకంపనల నేపథ్యంలో మెటా గ్లోబల్ అఫైర్స్ అధికారి జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం బుధవారం కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో 45 నిమిషాల పాటు అత్యవసర సమావేశం నిర్వహించింది. టెక్నికల్ గ్లిచ్ (సాంకేతిక లోపం) వల్లే వీడియో కనిపించకుండా పోయిందని మెటా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రభుత్వం ఆ వివరణను తోసిపుచ్చింది. మెటా బృందం త్వరలోనే కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలవనుంది. గూగుల్ ప్లేస్టోర్‌లోని మోసపూరిత ఫ్రాడ్ యాప్‌ల ద్వారా సైబర్ నేరాలు జరుగుతుండటంపై కూడా కమిటీ లేఖ రాసింది. ఇటీవల హైదరాబాద్‌లో రూ. 48 లక్షల సైబర్ మోసం కేసులో హైదరాబాద్ పోలీసులు గూగుల్ ఇండియా హెడ్‌ను నిందితుడిగా చేర్చిన విధానాన్ని ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం కూడా గూగుల్ ఇండియాపై ఇలాంటి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.
Epaper: epaper.vaartha.com
"సంయమనం పాటించండి, యువతను శాంతింపజేయండి": పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

