Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెట్రోలో మోదీ సందడి.. చిన్నారులతో సరదాగా ముచ్చట్లు

మెట్రోలో మోదీ సందడి.. చిన్నారులతో సరదాగా ముచ్చట్లు

వార్త 2 weeks ago

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఢిల్లీ మెట్రోలో సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్‌ఆర్‌సీసీ) శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో రోడ్డు మార్గానికి బదులుగా మెట్రో మార్గాన్ని ఎంచుకోవడం విశేషం.

రాత్రి దాదాపు 7 గంటల సమయంలో ఎల్లో లైన్ మెట్రో ఎక్కిన ప్రధాని, తన ప్రయాణానికి సాధారణ మెట్రో కార్డును ఉపయోగించారు. ఎలాంటి వీఐపీ హడావుడి లేకుండా సాగన ఈ ప్రయాణం తోటి ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని మిగిల్చింది.

విద్యార్థులు మరియు చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చట్లు

సుమారు 20 నిమిషాల పాటు సాగిన ఈ మెట్రో ప్రయాణంలో ప్రధాని మోదీ ప్రయాణికులతో మమేకమయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలోని విశ్వవిద్యాలయ స్టేషన్‌ వరకు సాగిన ఈ దారిలో కోచ్‌లోని విద్యార్థులు, మహిళలతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. రైలులో ఉన్న చిన్నారులతో కరచాలనం చేస్తూ వారిని పలకరించారు. ఈ సందర్భంగా ఒక చిన్నారి మోదీ చెవిలో ఏదో గుసగుసలాడిన దృశ్యాలు, ప్రధాని చిరునవ్వుతో స్పందించిన తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

Narendra Modi: ఎస్‌ఆర్‌సీసీ వేదికగా ప్రధాని కీలక ప్రసంగం

మెట్రో ప్రయాణం ముగిసిన వెంటనే ఎస్‌ఆర్‌సీసీ శతాబ్ది ఉత్సవాలకు చేరుకున్న ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ఆర్థిక వృద్ధి, రక్షణ రంగంలో పెరుగుతున్న ఎగుమతులు, నక్సలిజం నిర్మూలన దిశగా సాధించిన విజయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా తిరోగమన, అరాచకవాద భావజాలాన్ని తూర్పారబడుతూ ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని ప్రయోగించారు. కళాశాల పూర్వ విద్యార్థుల గొప్ప విజయాలతో తనను తాను బేరీజు వేసుకుంటూ, తాను కేవలం ‘ఆరో ఆటగాడిని’ మాత్రమేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి.

ప్రజలతో మమేకమవ్వడంలో మోదీ ప్రత్యేక శైలి

ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ ప్రజలతో కలిసిపోవడంలో మోదీ ఇలాంటి ఆకస్మిక ప్రయాణాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో 2023లో ఢిల్లీ యూనివర్సిటీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా, అలాగే 2024 ఫిబ్రవరిలో మీరట్ మెట్రో ప్రారంభ సమయంలోనూ ఆయన ఇలాగే మెట్రోలో ప్రయాణించారు. భద్రతా నిబంధనలను పక్కనపెట్టి, సామాన్య ప్రజల మధ్యలో తిరుగుతూ వారి జీవనశైలిని పంచుకునే ప్రధాని ప్రత్యేక శైలి మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

నేపాల్ ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha