Pak : షాంగై సహకార సంస్థ (SCO) సమ్మిట్ సందర్భంగా తీసిన గ్రూప్ ఫోటోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని క్రాప్ చేసి (తొలగించి) సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పాకిస్థాన్ చర్యను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు.
SCO సదస్సు గ్రూప్ ఫోటో నుంచి ప్రధాని మోదీ బొమ్మను తీసివేసి ప్రచారం చేసుకోవడం పాకిస్థాన్ సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతోందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే మండిపడ్డారు. ఒక ఫోటో నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించినంత మాత్రాన భారతదేశంలో గానీ, అంతర్జాతీయంగా గానీ ఆయనకున్న ప్రతిష్ఠ, ప్రజాదరణ ఎప్పటికీ తగ్గవని స్పష్టం చేశారు. డిజిటల్ వేదికలపై ఇటువంటి చవకబారు పనులు చేయడం వల్ల పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో మరింత చులకనవుతుందని, భారత్‌ను అనవసరంగా రెచ్చగొట్టే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ప్రపంచ పటంలో పాక్ ఉండదు - షిండే సంచలన హెచ్చరిక
భారతదేశ సార్వభౌమత్వాన్ని, నాయకత్వాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని పాకిస్థాన్‌కు షిండే హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ దృఢ నిశ్చయంతో అడుగు ముందుకు వేసి, ఒక్కసారి మనసు పూనుకుంటే ప్రపంచ పటంలోనే పాకిస్థాన్ అనేది లేకుండా పోయే పరిస్థితి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై చిల్లర చేష్టలకు స్వస్తి చెప్పి, భారత్‌తో శత్రుత్వ విధానాలను మానితేనే పాకిస్థాన్‌కు భవిష్యత్తు ఉంటుందని, భారత సాయుధ బలగాలు మరియు నైతిక బలం ముందు పాక్ పప్పులు ఉడకవని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు.
ప్రధాన నదుల్లో నీటి మట్టాలు పెరుగుతుండటంతో నేపాల్ వరద హెచ్చరిక జారీ

