Aamir Khan Third Marriage: బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ముచ్చటగా మూడోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
గత కొంతకాలంగా తనతో ప్రేమలో ఉన్న ప్రియురాలు గౌరీ స్ప్రాట్ (Gauri Sprott) ను ఆయన వివాహం చేసుకున్నారు. ఆదివారం (జూలై 5, 2026) ముంబైలోని ఆమిర్ ఖాన్ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక సరళంగా ముగిసింది. మధ్యాహ్నం సరిగ్గా 12:45 గంటలకు ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ రిజిస్టర్డ్ మ్యారేజ్ పేపర్లపై సంతకాలు చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
Read Also:VenkyAnil5 Movie Poster:వెంకటేష్-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ క్రేజీ పోస్టర్ అవుట్
సోషల్ మీడియాలో ఏజ్ గ్యాప్ చర్చ.. 14 ఏళ్ల వ్యత్యాసం

ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వార్త బయటకు రావడంతో నెటిజన్లు ఈ జంట వయసు వ్యత్యాసంపై (Age Gap) తెగ చర్చించుకుంటున్నారు. ఆమిర్ ఖాన్ 1965 మార్చి 14న జన్మించగా, గౌరీ స్ప్రాట్ 1978 ఆగస్టు 21న జన్మించారు. దీని ప్రకారం ఆమిర్, గౌరీల మధ్య దాదాపు 14 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది.
Aamir Khan Third Marriage: 25 ఏళ్ల స్నేహం.. మళ్లీ చిగురించిన ప్రేమ
ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ల బంధానికి 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. పాతికేళ్ల క్రితమే వీరిద్దరూ మంచి స్నేహితులు. అయితే, గౌరీ ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లడం, ఆమిర్ ఖాన్ వరుస సినిమాలతో బాలీవుడ్‌లో బిజీ కావడంతో ఇద్దరూ ఒకరికొకరు దూరమయ్యారు. కానీ, ఇటీవల ఆమిర్ ఖాన్ బంధువు నుజత్ ఖాన్ ద్వారా వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. పాత స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో ఇప్పుడు ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. గతంలో గౌరీకి ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తితో వివాహం కాగా, మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, గత కొన్నేళ్లుగా ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌లోనే గౌరీ కీలక బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం.
బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్ప్రాట్ కుమార్తె. బ్లూ మౌంటెన్ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన గౌరీ, ఆ తర్వాత లండన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్, స్టైలింగ్ మరియు ఫోటోగ్రఫీలో ఉన్నత కోర్సులు పూర్తి చేశారు. ఆమిర్, గౌరీల వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

