Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

వార్త 1 week ago

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు తన అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.

“ప్రజల కోసం నిలబడితే ప్రజలు మన వెంట నిలబడతారు, నిజం కోసం నిలబడితే నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదే నా నమ్మకం” అంటూ ఆయన నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో తనను అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన ఘటన తనలో ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచిందని తెలిపారు.

“నన్ను జైల్లో పెట్టగలరు కానీ, స్థైర్యాన్ని దెబ్బతీయలేరు”

గత పాలకుల కక్షసాధింపు చర్యలపై చంద్రబాబు స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా కుట్రపూరితంగా తనను జైలులో నిర్బంధించారని మండిపడ్డారు. “నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ, నా మనోధైర్యాన్ని మాత్రం ఏమాత్రం దెబ్బతీయలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు, ఎక్కడా లొంగిపోలేదు” అని స్పష్టం చేశారు. ఆ క్లిష్ట సమయంలో దేశవిదేశాల నుంచి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తన కోసం గొంతు ఎత్తారని, ఆనాడు వారు చూపిన సంఘీభావం తన జీవితంలో ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు.

Chandrababu Naidu: ప్రజాస్వామ్య విజయం.. 2024 ఎన్నికల తీర్పు

2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఓటు రూపంలో తమ నిరసనను, మద్దతును అత్యంత బలంగా చాటారని చంద్రబాబు కొనియాడారు. కక్షసాధింపు రాజకీయాలకు ప్రజలు తమ తీర్పుతో చరమగీతం పాడారని, నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను తనకు అప్పగించారని తెలిపారు. ఆనాడు సాగిన పోరాట స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలు.. ప్రజల కోసం మరింత అంకితభావంతో పనిచేయాలనే తన సంకల్పాన్ని మరింత బలపరిచాయని వివరించారు.

తెలుగు జాతిని నంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యం

ఈ సందర్భంగా కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి, ప్రజలకు చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరి సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను, తెలుగు జాతిని అన్ని రంగాల్లోనూ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపాలనే తన జీవిత ఆశయాన్ని తప్పకుండా నిజం చేసి తీరుతానని ఆయన పునరుద్ఘాటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha