Choutakur Incharge Tahsildar: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల ఇంచార్జి తహసీల్దార్‌గా డిప్యూటీ తహసీల్దార్ అనుదీప్ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు.
గతంలో చౌటకూర్ తహసీల్దార్‌గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం, క్షేత్రస్థాయి రెవెన్యూ వ్యవహారాలపై పట్టు, ప్రభుత్వ భూముల పరిరక్షణ మరియు వివాదాల పరిష్కారంలో ఆయన కనబరిచిన చొరవను గుర్తించిన ఉన్నతాధికారులు మరోసారి ఆయనకే మండల పరిపాలనా పగ్గాలు అప్పగించారు. సమర్థవంతమైన అధికారి మళ్లీ రాకతో మండల పరిధిలోని రెవెన్యూ సేవలు మరింత వేగవంతం కానున్నాయి.
రూ. 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి పరిరక్షణలో కీలక పాత్ర
గతంలో చౌటకూర్ పరిధిలోని సర్వే నంబర్ 1684లో అసైన్‌మెంట్ నిబంధనలకు విరుద్ధంగా అన్యాక్రాంతమైన సుమారు 16 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడంలో అనుదీప్ అత్యంత సాహసోపేతంగా, కీలకంగా వ్యవహరించారు. మార్కెట్లో దాదాపు రూ. 50 కోట్ల విలువైన ఈ భూమిని కాపాడటంలో ఆయన చూపిన ప్రత్యేక చొరవ అప్పట్లో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆ స్థలంలో ట్రైబల్ లా కాలేజీతో పాటు స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, ఇతర ప్రజా ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
Choutakur Incharge Tahsildar: ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ, సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ సమస్యలకు పరిష్కారం
ప్రతిష్టాత్మక రీజినల్ రింగ్ రోడ్ (RRR) భూసేకరణ ప్రక్రియలోనూ భూములు కోల్పోతున్న రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందేలా అధికారులతో సమన్వయం చేస్తూ ఆయన పరిష్కార మార్గాలు చూపారు. అదేవిధంగా సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న భూవివాదాన్ని అప్పటి ఆర్డీవో పండు, సీఐ అనిల్‌కుమార్‌ల సహకారంతో శాంతియుతంగా పరిష్కరించారు. పట్టాదారు గోళ్ల మల్లేశంకు న్యాయబద్ధంగా పరిహారం అందించి సమస్యను కొలిక్కి తెచ్చారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణతో పాటు పారదర్శక సేవలు అందించే అధికారిగా పేరున్న అనుదీప్ మూడోసారి బాధ్యతలు చేపట్టడంపై స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Epaper: epaper.vaartha.com

