S Janaki : ప్రముఖ దిగ్గజ గాయని, 'గానకోకిల' ఎస్. జానకి అంత్యక్రియలు కర్ణాటకలోని మైసూర్ నగరంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. నిన్న ఆమె హఠాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ఈ ఉదయం 8 గంటల నుండి అభిమానులు, ప్రజల సందర్శనార్థం మైసూర్‌లోని ప్రసిద్ధ మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌లో ఆమె పార్థివదేహాన్ని ఉంచారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు అలరించిన ఈ మహోన్నత గాయనిని కడసారి చూసేందుకు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు.

అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు.. కన్నీటిపర్యంతమైన అభిమానులు
మహారాజా కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకున్న అభిమానులు ఎస్. జానకి గారు పాడిన వేలాది మధుర గీతాలను, ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి నివాళులు అర్పించారు. సందర్శన సమయం ముగిసిన అనంతరం, పోలీసులు ప్రభుత్వ లాంఛనాల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత అత్యంత విషాదకర వాతావరణంలో, అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించి తుది వీడ్కోలు పలికారు. ఆమె భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, ఆమె పాడిన పాటల రూపంలో ఎప్పటికీ అమరురాలిగానే ఉంటారని సంగీత ప్రియులు పేర్కొంటున్నారు.

