Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముక్త్యాల-మచిలీపట్నం జలమార్గంతో కొత్త రవాణా మార్గం

ముక్త్యాల-మచిలీపట్నం జలమార్గంతో కొత్త రవాణా మార్గం

వార్త 3 weeks ago

Muktyala Machilipatnam Waterway : ఎన్టీఆర్‌ జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

సుమారు రూ.1,700 కోట్ల అంచనా వ్యయంతో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్ర జలరవాణా అథారిటీ సమర్పించిన ఆర్‌ఎఫ్‌పీని పరిశీలించిన కేంద్ర జలరవాణా అధికారులు కొన్ని మార్పులు, షరతులతో ప్రాథమిక అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదిత జలమార్గం ముక్త్యాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు కృష్ణా నదిలో 82 కిలోమీటర్ల మేర ఉంటుంది. ప్రకాశం బ్యారేజి నుంచి బందరు కాలువ మీదుగా మచిలీపట్నం వరకు మరో 86 కిలోమీటర్ల మేర జలరవాణా సాగుతుంది. దీంతో మొత్తం మార్గం 168 కిలోమీటర్లకు చేరుతుంది. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర జలరవాణా అథారిటీ అధికారులు కేంద్ర అధికారులతో చర్చలు జరిపారు. ప్రాజెక్టు ప్రణాళిక, నీటి లభ్యత, జలమార్గంలో అవసరమైన మౌలిక వసతులపై వివరాలను సమర్పించినట్లు సమాచారం. జగ్గయ్యపేట పారిశ్రామిక కారిడార్‌లోని పరిశ్రమలకు ఈ జలమార్గం ప్రధానంగా ఉపయోగపడే అవకాశం ఉంది. సిమెంట్, సున్నపురాయి, ఫ్లైయాష్‌ వంటి భారీ సరుకులను మచిలీపట్నం పోర్టుకు తరలించేందుకు జలరవాణాను ఉపయోగించవచ్చు. భారీ లోడ్లను రోడ్డు మార్గంలో తరలించడంతో పోలిస్తే జలరవాణా ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించే అవకాశం ఉండటంతో పరిశ్రమలకు ఆర్థికంగా ప్రయోజనం కలగవచ్చని ప్రాజెక్టు నివేదికలో అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టుతో పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Poverty : సంబరాలు సరే.. సామాజిక బాధ్యత లేదా?

 Muktyala Machilipatnam Waterway

Muktyala Machilipatnam Waterway : వేసవిలోనూ నీటి లభ్యతపై అధ్యయనం

జలమార్గం ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలంటే తగినంత నీటి మట్టం ఉండటం కీలకం. అందుకే వేసవిలో, ముఖ్యంగా మే నెలలో కూడా కృష్ణా నదిలో నీటి లభ్యతపై అధికారులు అధ్యయనం చేసినట్లు తెలిపారు. ముక్త్యాల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు కృష్ణా నదిలో సుమారు 0.7 మీటర్ల నుంచి 4.5 మీటర్ల వరకు నీటి లోతు ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. బందరు కాలువలో 1.5 మీటర్ల నుంచి 3.5 మీటర్ల వరకు నీటి లోతును పరిగణనలోకి తీసుకుని జలరవాణా ప్రణాళికను రూపొందిస్తున్నారు. వేసవి సమయంలో నీటి కొరత కారణంగా జలరవాణాకు అంతరాయం కలగకుండా పులిచింతల బ్యాలెన్సింగ్‌ జలాశయం నుంచి అవసరమైన మేరకు నీటిని మళ్లించే ప్రతిపాదన చేశారు. పంట కాలం పూర్తైన తర్వాత బందరు కాలువలోని లాకులను మూసివేసి అవసరమైన నీటి మట్టాన్ని నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నీటి నిర్వహణ ప్రతిపాదనలకు రాష్ట్ర జలవనరుల శాఖ నుంచి అనుమతులు లభించినట్లు ఏపీ జలరవాణా అథారిటీ అధికారులు వెల్లడించారు. ముక్త్యాల-మచిలీపట్నం జలమార్గం పూర్తయితే కృష్ణా నది పరివాహక ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతాలు, మచిలీపట్నం పోర్టు మధ్య సరకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది. భారీ సరుకుల రవాణాలో జలమార్గాన్ని వినియోగించడం ద్వారా రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

వరదలో కొట్టుకొచ్చిన మద్యం బాటిల్స్..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha